మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన
పుత్తూరు : తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం నడిబొడ్డున మద్యం షాపు ఏర్పాటుకు నాలుగోసారి ప్రయత్నించిన నిర్వాహకులకు నిరాశే మిగిలింది. శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా తిరుపతి రోడ్డులో గౌడ మద్యం షాపును తెరిచారు. విషయం తెలుసుకొన్న స్థానిక రామారావు, రామానాయుడు కాలనీలకు చెందిన మహిళలు షాపు ముందు బైఠాయించారు. దీంతో మద్యం షాపు వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకొన్న డీఎస్పీ రవికుమార్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు మద్యం షాపు నిర్వాహకులు అమ్మకాలు లేకపోయినా షాపును యథావిధిగా తెరిచే ఉంచారు. దీంతో మహిళల సంచారం ఎక్కువగా ఉన్న తిరుపతి రోడ్డులోని కాలనీల మధ్య షాపు ఏర్పాటు వద్దంటూ మహిళలు భీష్మించుకొని కూర్చొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు షాపు ముందే బైఠాయించి మద్యం అమ్మకాలు జరగకుండా అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పికెట్ వేసి కూర్చొన్నారు. ఇలా మద్యం షాపు ఏర్పాటును మహిళలు అడ్డుకోవడం ఇది నాల్గవసారి. గత నవంబర్ 5, 15, 22వ తేదీల్లోనూ ఇదే షాపు ప్రారంభోత్సవాలను స్థానిక మహిళలు అడ్డుకోవడం గమనార్హం.
మద్యం షాపు వద్ద బైఠాయించిన మహిళలు, పక్కనే పోలీస్ పికెట్
రాత్రి అయినా మద్యం షాపు వద్ద మహిళల నిరసన
మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన


