వేతనాలు పెంచాల్సిందే!
– కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్‌వాడీ కార్యకర్తల వేత నాలు పెంచి తీరాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడు తూ.. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోగలమన్నారు. అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్న చంద్రబాబు ప్రభు త్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. వేతనాల పెంపు చేయకపోగా పనిభారం పెంచారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కువైనట్లు తెలిపారు. శిశు సంక్షేమ శాఖా మంత్రి రకరకాలుగా సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీచేసిన అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారన్నారు. దీని బట్టి వ్యతిరేకత ఎలా ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చేబుతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో మోహన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్తా, అంగన్‌వాడీ సంఘాల నాయకులు ప్రమీల, మమత, లీలావతి, మమత, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


