36 బైక్‌లు..ముగ్గురు దొంగలు అరెస్టు
గుడిపాల : వారందరూ కరుడుగట్టిన దొంగలు. ఇదివరలోనే చిత్తూరు, తమిళనాడులో పలు కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి అక్కడున్న వారితో పరిచయాలు పెంచుకొని బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడేవారు. వీరందరూ కలిసి తమిళనాడులో 34 ద్విచక్ర వాహనాలు, చిత్తూరు ప్రాంతంలో రెండు వాహనాలను చోరీ చేసుకొని తక్కువ ధరకు అమ్మేవారు. వీరిని గుడిపాల పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గుడిపాల పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ.. గుడిపాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు బైక్ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. గుడిపాల మండలం చిత్తపారకు చెందిన కిరణ్‌కుమార్( 34), తమిళనాడు రాష్ట్రం కాట్పాడి సమీపంలోని లత్తేరికి చెందిన వైరముత్తు(39), కాట్పాడికి చెందిన జయసూర్య(35) కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. వీరితో పాటు గుడిపాల మండలం పల్లూరు గ్రామానికి జయప్రకాష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. 2024 సంవత్సరంలో కాట్పాడి, వేలూరులో దొంగతనం చేసి ఆంధ్రాలో మోటార్ సైకిళ్లు అమ్ముతుండగా కాట్పాడి పోలీసులు పట్టుకొని వారిని జైలుకు పంపారన్నారు. జైలులో ఉన్నప్పుడు లత్తేరికి చెందిన వైరముత్తుతో పరిచయం ఏర్పడి జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొని ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కిరణ్, వైరముత్తు, జయప్రకాష్, జయసూర్య అందరూ కలిసి గుడిపాల, యాదమరి, వేలూరు జిల్లాలో 36 బైక్‌లను దొంగతనం చేశారు. వారిని గొల్లమడుగు వద్ద అరెస్టు చేసి, బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఇందులో కిరణ్‌పై 8 కేసులు, వైరముత్తుపై 29 కేసులు, జయసూర్యపై 3 కేసులు ఉన్నాయని జయప్రకాష్ పరారీలో ఉన్నట్లు అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ రామ్మోహన్ పాల్గొన్నారు.


