ఒంటమిట్ట చెరువులో 108 అడుగుల విగ్రహం
ఏకశిలానగరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
50 ఏళ్ల లక్ష్యంగాఅభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు
రాజంపేట: ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న అన్నమయ్య జిల్లాలోని ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది.
పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో 600 జయంత్యుత్సవాల సందర్భంగా 108 అడుగుల అన్నమయ్య విగ్రహం రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. అదే తరహాలో ఏకశిలానగరంలోని చెరువులో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తే.. అదే భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నది. ఇప్పటికే దాశరథి కల్యాణ మండపం సమీపంలో నామమాత్రంగా జాంబవుంతుడి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
చెరువులోనే ఎందుకు?
పురాణ, ఇతిహాసాల చరిత్ర ఆధారంగా ఒంటమిట్ట వద్ద జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. రామాయణం, భాగవతం కథనాల ప్రకారం జాంబవంతుడు.. బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడు భల్లూకరాజుగా గుర్తింపు ఉంది. రామాయణంలో కూడా శ్రీరాముడితో కలిసి లంక యుద్ధంలో పోరాడిన జాంబవంతుడు శక్తియుక్తులు చాటారు. హనుమంతుడి శక్తిని గుర్తు చేసి, సీతాదేవిని వెతకడానికి ప్రేరేపించిన మహాబలశాలి మాత్రమే కాకుండా, వివేకవంతుడని ప్రస్తావించారు.
శ్రీ కృష్ణుడికి శమంతకమణి ఇవ్వడంతోపాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేశాడట. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం ఈ ఏకశిల విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించారని ఒక కథనం. అందుకే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కోవెలకు ల్యాడ్‌మార్క్‌గా జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం నిలవనున్నదనే భక్తుల మనోగతం.
50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని...
రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని అధికారిక పండుగగా నిర్వహించే ఏకశిలానగరం ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి కేంద్రీకృతం చేసింది. 50 ఏళ్లను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆ దిశగా మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మ్యూజియం: భక్తుల కోసం కల్యాణ కట్ట, పుష్కరిణి, నక్షత్రవనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాతి్మక చిహా్నలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం నవతరానికి అందించేలా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం,తోరణాలు ఏర్పాటు చేయనున్నారు.
పెరుగుతున్న యాత్రికుల అంచనాతో..
పెరిగే యాత్రికుల సంఖ్యను అంచనా వేసి, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా సదుపాయాలు, వసతి రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళిక ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు అందాయి. నిత్యఅన్నదాన పథకం అమలు చేయడానికి వీలుగా అన్నదానసత్రం, వసతుల కోసం రూ.4.35 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు.
ఆధ్యాత్మిక క్షేత్రంగా..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనున్నది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నది. ఒంటిమిట్ట చెరువు జాతీయ రహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో పక్క జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. శ్రీరామనవమి ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువ్రస్తాలు తీసుకురావడం సంప్రదాయంగా పాటిస్తున్నారు.
ప్రణాళికలో..
మాడవీధులు, రథశాల, పుష్కరిణి, సంజీవరాయస్వామి ఆలయం, మాలఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామలక్ష్మణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 23న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అనిల్‌కుమార్ బృందం ఒంటిమిట్టను పరిశీలించిన సంగతి విదితమే.
అభివృద్ధికి విశేష కృషి
ఏకశిలానగరాభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మార్క్ బాగా కనిపిస్తుందని రామభక్తుల మనోగతం. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అధికారిక రామాలయంగా ప్రకటించారు. టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ తొలినాళ్లలో రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అడుగులు వేశారు. ఆనాటి మాస్టర్‌ప్లాన్‌తో ఇప్పటి రామాలయం శోభ సాక్షాత్కరిస్తుంది.
మళ్లీ ఆయనే టీటీడీ ఈవోగా రావడంతో 50 ఏళ్లను ముందుగానే దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా పాలకమండలి సహకారంతో నిర్ణయాలు టీటీడీ తీసుకునేలా, అధికారులను సమాయత్తం చేశారు. ఇప్పుడు ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడివిగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడానికి ఈవో కారకులయ్యారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


