‘అమరావతి బిల్లు’ వెనక్కి! | Central government has sent the Amaravati Bill back | Sakshi
Sakshi News home page

‘అమరావతి బిల్లు’ వెనక్కి!

Dec 11 2025 5:12 AM | Updated on Dec 11 2025 5:12 AM

Central government has sent the Amaravati Bill back

తిప్పి పంపిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: ‘అమరావతి’ని ఏపీ రాజ­ధా­నిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యా­యా.. కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా.. నిధు­ల ప్రశ్న తలెత్తుతోందా.. వీటన్నింటికీ రాజ­కీయ విశ్లేషకులు ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబా­బు­కు కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చిందంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి ఏపీ రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించాలని రా­ష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెన­క్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణనలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయ పరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్‌తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్‌ను వెనక్కు పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్‌ ఫైల్‌ వెనక్కు రావడంతో న్యాయ పరమైన చిక్కులను తొలగించుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్లు మారింది. 

రాజధానిపై కేంద్రం ప్రశ్నలు
రాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘అమరావతి’కి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ‘అమరావతి’ని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్‌ కేంద్రాన్ని కోరింది. ‘పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ‘హైదరాబాద్‌’ రాజధానిగా ఉంది కదా? ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. 

‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం–2014’లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

కాగా, విభజన చట్టంలోని సెక్షన్‌ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందు పరిచింది. ఇందులోని సబ్‌ సెక్షన్‌ 2లో.. ‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’ అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్‌ సెక్షన్‌ 3లో కేంద్రం పేర్కొంది. 

నోటిఫికేషన్‌ వెనక్కు?
ఈ సందర్భంగా న్యాయ, చట్టపరమైన చిక్కులను అధిగవిుంచే సూచనలతో రావాలని నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌5(2)లో ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశ పడింది. కేంద్రం ఆమోదించి, వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మీడియా ముఖంగా వెల­­్లడించిన సంగతి తెలిసిందే. 

అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయ పరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. 

ఈ అంశంపై ‘సాక్షి’ ఇద్దరు ఎంపీలను ఆరా తీయగా.. సమయం వచ్చినప్పుడు పార్లమెంట్‌ ముందుకు వస్తుందంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఎలా ముందుకు వెళితే బావుంటుందో సూచించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement