అందుకే ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయి
అక్రమంగా వలస వచ్చినవారికి ఓటు హక్కు ఇవ్వాలా?
విపక్షాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆగ్రహం
ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు.
దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్‌ఐఆర్‌ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది
‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది.
అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్‌లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు.
ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి
మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్‌ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు.
చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు.
ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్‌ఐఆర్‌తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి.
అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్‌ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్‌ఐఆర్‌పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
కాంగ్రెస్ హయాంలోనే ఎస్‌ఐఆర్ ప్రారంభం
ఎస్‌ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్‌ఐఆర్‌ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు.
రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్‌ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్‌ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్‌ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్‌ఐఆర్‌ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్‌ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు.


