గ్రావెల్ తరలింపుపై అధికారుల డ్రామా
తప్పించుకునేందుకు తిప్పలు
ఏడాదిగా యథేచ్ఛగా కుందూనది కరకట్ట గ్రావెల్ తరలింపు
రూ.కోట్లు విలువైన గ్రావెల్ కొల్లగొట్టిన అక్రమార్కులు
రిజిస్టర్ పోస్టు ద్వారా కోవెలకుంట్ల, గోస్పాడు పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదులు
సాక్షి, టాస్క్ ఫోర్స్: కుందూ నది కరకట్టపై ఏడాదిగా గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలించుకుపోతున్నా.. పట్టించుకోని కేసీ కెనాల్ అధికారులు తాజాగా డ్రామా మొదలు పెట్టారు. రైతులు, ప్రజా సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తప్పించుకునేందుకు సాకులు చెబుతున్నారు.
పనిఒత్తిడి వల్ల గమనించలేకపోయామని, ఈ అక్రమాలపై పోలీసులకు తెలియజేశామని తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. ఇటీవల కోవెలకుంట్ల, గోస్పాడు పోలీస్‌స్టేషన్లకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదులు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ ఫిర్యాదుల్లో సమగ్రవివరాలు పొందుపరచకపోవడంతో పోలీసులూ ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే..!
వర్షాకాలంలో కుందూనది పొంగి వరద నీరు గ్రామాలు, పొలాలను ముంచెత్తుతుండడంతో సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ హయాంలో చర్యలు చేపట్టారు. నంద్యాల, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో రూ.1,350 కోట్లతో కుందూనది విస్తరణ పనులు జరిగాయి. ఈ పనుల్లో భాగంగా మట్టి(బెలుకు) కరకట్టలను పటిష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు, అక్రమార్కులు కలగలసి కరకట్టపై గ్రావెల్‌ను యథేచ్ఛగా కొల్లగొట్టడం మొదలు పెట్టారు.
ఏడాదిగా ఈ తంతు జరుగుతున్నా.. కరకట్ట పటిష్టతను పర్యవేక్షించాల్సిన కేసీ కెనాల్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా అక్రమార్కులు రూ.కోట్లు దండుకున్నారు. ముఖ్యంగా కోవెలకుంట్ల, గోస్పాడు మండలాల పరిధిలో ఉన్న కరకట్టపై గ్రావెల్‌ను అధికారపార్టీ నేతల అండదండలతో తరలించుకుపోయారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కరకట్ట పూర్తిగా మాయమైంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు కళ్లుతెరిచారు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టారు.
ట్రాక్టర్ గ్రావెల్ రూ. వెయ్యి నుంచి రూ.1,200కు..!
అక్రమార్కులు కరకట్టలపై గ్రావెల్‌ను ట్రాక్టర్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే మట్టిని వందల సంఖ్యలో ట్రాక్టర్లపై తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు కానీ, కేసి కెనాల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కేసీ కెనాల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామన్న సాకుతో అక్రమార్కులు గత రెండు, మూడు నెలల నుంచి ఇతర నిర్మాణ పనులకు బెలుకును తరలించారు. ఈ ప్రాంతంలో కరకట్ట పూర్తిగా మాయం కావడంతో వర్షాకాలం కుందూ నది పొంగి మళ్లీ గ్రామాలను ముంచెత్తే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.


