సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణమే మా ప్రయారిటీ
అప్పులు, అసమర్థతతో విధ్వంస పాలన మీ రియాలిటీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.4 శాతమైతే సొంత పన్నుల ఆదాయ వృద్ధి 2.58 శాతమేనా?
దేశ జీడీపీలో 2014–19 మధ్య రాష్ట్ర వాటా 4.45.. 2019–24 మధ్య రాష్ట్ర వాటా 4.78 శాతం
ఈ లెక్కన మీ పాలన బాగున్నట్లా? మా పాలన బాగున్నట్లా?
ఐదేళ్లలో మా హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.32 లక్షల కోట్లే
18 నెలల మీ పాలనలో ఏకంగా రూ.2,66,715 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) మీరు చెప్పినట్లు 10.4 శాతంగా ఉన్నట్లయితే.. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి 2.58 శాతానికి ఎందుకు పరిమితమైంది? అసమర్థతతో కూడిన విధ్వంస పాలనకు ఇది తార్కాణం కాదా?’ అని సీఎం చంద్రబాబును మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా జీడీపీ వృద్ధి.. పన్నుల ఆదాయ వృద్ధి సమానంగా ఉంటుందనానరు.
బాబు అడుగడుగునా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ అంకెల గారడీ చేస్తు న్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణం ప్రాధాన్యాంశాలుగా పనిచేసిందని చెప్పారు. కాగ్ నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను కడిగి పారేశారు. ఆ వివరాలు బుగ్గన మాటల్లోనే..
» బాబు థియరీ ఎప్పుడూ ప్రాక్టికల్‌గా మారదు. 2014–15లో ఆయన పాలన బ్రహ్మాండంగా ఉంటే.. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.45 శాతానికి ఎందుకు పరిమితమైంది? వైఎస్ జగన్ హయాంలో 2019–24లో రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.78 శాతానికి పెరిగింది. ఎవరి పాలన బాగున్నట్టు?
» 2019–24 మధ్య జీఎస్‌డీపీ 9.7 శాతం పెరగ్గా.. ఆదా యం 10.7 శాతం పెరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు 12 శాతం జీఎస్‌డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు కేవలం 3 శాతం మాత్రమే పెరుగుతుంది? వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య జీఎస్‌డీపీ 10.2 శాతం పెరగ్గా.. ఆదాయం కూడా 9.8 శాతం పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో 12 శాతం జీఎస్‌డీపీ పెరిగిందంట. ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగిందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం?
» దేశ వ్యాప్తంగా తలసరి ఆదాయంలో 2013–14 నుంచి 2018–19 వరకు మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. మా పరిపాలనలో అది 15వ స్ధానానికి పెరిగింది. ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా?
» ఇప్పుడు బాబు సర్కార్ 18 నెలల పాలనలో దాదాపు రూ. 2,66,175 కోట్లు అప్పుచేసిన మాట వాస్తవం కాదా? బడ్జెట్ అప్పు రూ.1,54,880 కోట్లు, బడ్జెట్ బయట అప్పు రూ.1,11,295 కోట్లు చేసిన మాట వాస్తవం కాదా? మా హయాంలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు ఎలా చెబుతావ్ బాబూ? మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే.. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పు రూ.7,21,918 కోట్లు మాత్రమే.
ఇందులో 2019లో మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.3,90,247 కోట్లు. ఈ లెక్కన మేము ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మీరు ఏడాదిన్నర లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసి.. మా అప్పుల గురించి మాట్లాడతావా? ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా?
» 2025–26లో దేశ వ్యాప్తంగా చూస్తే అప్పులు చేయడంలో ఏపీ రూ.63,052 కోట్లతో దేశంలోనే ప్రథమ స్ధానంలో ఉందని కాగ్ చెప్పింది. ఆదాయ వృద్ధిలోనూ వెనుకబడిపోతున్న మీరా సంపద సృష్టి గురించి మాట్లాడేది?
» పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2024 అక్టోబర్ 9న రూ.2,348 కోట్లు కేంద్రం అడ్వాన్సుగా ఇస్తే.. మీరు ఎస్‌ఎన్‌ఏ అకౌంట్‌లో వేయకుండా వేరే ప్రయోజనాల కోసం ఆ డబ్బులు ఖర్చుపెట్టారు. మళ్లీ మార్చి 12న రూ.2,705 కోట్లు మీ అకౌంట్లో వేస్తే.. అందులో రూ.570 కోట్లు పోలవరానికి ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు మీ సొంతానికి వాడుకున్నారు. ఇవాళ్టికి రూ.1,107 కోట్లు ఇతర ఖర్చులకు మళ్లించిన మాట వాస్తవం కాదా? మా హయాంలో మేమే డబ్బులు ఖర్చుపెట్టి.. కేంద్రం ఎప్పుడు రీయింబర్స్ చేస్తుందా అని చూసేవాళ్లం.
» విద్యుత్‌కు సంబంధించి మీ హయాంలో అప్పు 24 శాతం పెరిగితే మా హయాంలో 7 శాతం పెరిగింది.
» మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెబుతున్నారు. అంటే పీఏం కిసాన్ రూ.6 వేలు కాకుండా అన్నదాత సుఖీభవలో రైతులందరికీ రూ.20 వేలు వచ్చాయా? ఇప్పటి వరకు ఒక్కో రైతుకు రూ.40 వేలు రావాలి, వచ్చాయా? యువగళం కింద ఉపాధి లేని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇస్తున్నారా? ఆడబిడ్డ నిధి వచ్చిందా? తల్లికి వందనం కూడా అరకొరగా ఇచ్చారు. మూడు సిలెండర్లు అన్నారు, ఒక్కటిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ పథకాలేవీ ఇవ్వకుండానే మీరు చేసిన అప్పు ఏమైంది బాబూ?


