అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కోసం వెళ్లిన మహిళా రైతుకు దిమ్మతిరిగే షాక్
మేడికొండూరు మండలం భీమనేనివారిపాలెంలో ఘటన
మేడికొండూరు: కళ్లెదుట మనిషి బతికి ఉన్నా.. కంప్యూటర్లలో మాత్రం ఆమెను ఎప్పుడో చంపేసింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆ మహిళకు ఈ విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం, భీమనేనివారిపాలెంలో బుధవారం ఈ ఘటన జరిగింది. భీమనేనివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు మద్దినేని రాధారాణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ’అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్’ డబ్బులు జమ కాలేదు.
దీంతో అనుమానం వచ్చిన ఆమె, బుధవారం గ్రామం పరిధిలోని అన్నదాత సుఖీభవ కేంద్రానికి వెళ్లింది. అక్కడి సిబ్బందిని తన స్టేటస్ చెక్ చేయమని కోరింది. కంప్యూటర్‌లో వివరాలు పరిశీలించిన సిబ్బంది నీళ్లు నమిలారు. మీరు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది అని చెప్పడంతో ఆమె కంగుతింది. ‘అయ్యా.. నేను మీ కళ్ల ముందే ఉన్నాను కదా! నన్ను చనిపోయినట్లు ఎలా రాస్తారు?‘ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా ఒక ఎంట్రీ తప్పుగా నమోదు కావడం వల్ల అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఆగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రికార్డులు ఎలా మారుస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రికార్డులను సరిచేసి తనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాధారాణి కోరుతున్నారు.


