మరెందుకు క్యాంపు రాజకీయాలో..?
తాయిలాలతో పాటు విందు, వినోదాలూ
ఒక్కొక్కరికీ రూ.40 లక్షలు..?
రూ.కోట్ల కాంట్రాక్ట్ వర్కులంట..!
ముందుగా ఇంటికి క్యాష్ చేరిస్తేనే వెళ్తామంటున్న వైనం
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు
మలుపులు తిరుగుతున్న సింహపురి సిత్రం
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.
సాక్షి పొలిటికల్ టాస్‌్కఫోర్స్: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్‌పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్ కట్ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్‌బై చెప్పి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్‌తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు.
నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ..
వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
అనిల్ రంగప్రవేశంతో సీన్ రివర్స్
వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు.
క్యాషే.. క్యాషు
నిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్ రంగప్రవేశంతో వీరికి డిమాండ్ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు.


