శివాజీనగర: ‘రోజూ స్థానికుల్లో ఎవరో ఒకరు, మా నియోజకవర్గం వారు ప్రేమతో భోజనం తీసుకొచ్చి ఇస్తున్నారు. భోజనం వద్దని అనగలమా? ప్రేమతో ఆహ్వానిస్తారు.. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కో చోటుకు భోజనానికి వెళుతున్నాం. ఇది ఏ విందు భోజన సమావేశమూ కాదు’ అని డీసీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బెళగావి సర్క్యూట్ హౌస్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ సమాధానం చెప్పారు. బెళగావి శివార్లలో గురువారం రాత్రి ఎమ్మెల్యేలు విందు భోజనం చేశారనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నా నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ పని చేస్తున్నాడు.
అతని ఇంటి నుంచి ముద్ద, పప్పు, చారు తయారు చేసి పంపిస్తామని చెప్పాడు. ఇలా ప్రేమతో ఆహ్వానించినప్పుడు రాలేనని చెప్పగలమా?’ అని అన్నారు. ‘దొడ్డణ్ణ బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, నా మిత్రుడు. వారిది పెద్ద కుటుంబం. గత 15 సంవత్సరాల నుంచి తమ ఇంటికి భోజనానికి రావాలని పిలుస్తుండేవారు. మా కాంగ్రెస్ కుటుంబం వారిని మరవటానికి సాధ్యమా? అందువల్ల నాతో పాటు కొంతమంది ప్రజలు భోజనానికి వెళ్లాం.. అంతే! అందులో ఎలాంటి విందు భోజన సమావేశమూ లేదు’ అని తెలిపారు. శనివారం తమను ఆసిఫ్ సేఠ్, ఫిరోజ్ సేఠ్‡ భోజనానికి పిలిచారన్నారు.
చిన్నస్వామిలో క్రికెట్ మ్యాచులకు గ్రీన్‌సిగ్నల్
చిన్నస్వామి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచుల నిర్వహణకు అనుమతి కలి్పంచిన విషయమై అడిగిన ప్రశ్నకు డీకే స్పందిస్తూ.. బెంగళూరు గౌరవాన్ని కాపాడేందుకు తాము అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చిన్నస్వామి క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచులకు అనుమతి కలి్పంచామన్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల బాధ్యతను హోంమంత్రి పరమేశ్వర్‌కు అప్పగించామన్నారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ బృందం, పోలీసు అధికారులు కూర్చొని చర్చిస్తారన్నారు.


