గృహలక్ష్మిపై కాకి లెక్కలు
బనశంకరి: సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంచ గ్యారంటీల్లో ఇంటి మహిళా యజమానికి ప్రతి నెల రూ.2 వేలు అందించే గృహలక్ష్మి పథకం ఒకటి. కానీ కొన్ని నెలలుగా మహిళల అకౌంట్లకు గృహలక్ష్మి డబ్బు జమ కాలేదు. దీనిపై శుక్రవారం బీజేపీ సభ్యుడు, ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తప్పుడు లెక్కలు ఇచ్చారనే ఆరోపణ వినబడుతోంది. గృహలక్ష్మి డబ్బు ఆగస్టు నెల వరకు అందించామని మంత్రి తెలిపారు. కానీ ఆగస్టు వరకు మహిళల అకౌంట్లలో నగదు జమ కాలేదని ఎమ్మెల్యే సభలో ప్రభుత్వ అధికారిక రికార్డులు విడుదల చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా డబ్బు జమ కాలేదని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. అంతేగాక గృహలక్ష్మి పథకానికి సంబంధించిన రూ.5 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మహేష్ స్పీకర్ యూటీ.ఖాదర్‌కు లేఖ రాశారు. ఆగస్టు 2025 వరకు గృహలక్ష్మి డబ్బు విడుదల చేశామని మంత్రి చెప్పినా నిధులు విడుదల కాలేదని ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. మళ్లీ పరిశీలించాలని అడిగాం, కానీ ఫిబ్రవరి, మార్చి నెలలకు గృహలక్ష్మి నగదు విడుదల కాలేదన్నారు. సభకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయంపై సభలో అత్యవసరంగా చర్చించటానికి అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.
బాకీ ఉంటే జమ చేస్తాం–సీఎం స్పష్టీకరణ
ఈ విషయంపై జీరోఅవర్‌లో విపక్షనేత ఆర్.అశోక్ చర్చకు లేవనెత్తగా దీనికి సీఎం సిద్దరామయ్య సమాధానమిస్తూ బాకీ ఉంటే జమ చేస్తామని, సోమవారం మంత్రి సమాధానమిస్తారని సంజాయిషీ ఇచ్చారు.


