మూడు దుకాణాల్లో చోరీ
సాక్షి బళ్లారి: నగరంలో చోరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇటీవల దొంగల భయం తగ్గిందని భావించిన జనం.. శనివారం మూడు చోట్ల చోరీలు జరగడంతో ఉలిక్కిపడ్డారు. దొంగలు తమ ఉనికిని చాటుకునే విధంగా నగరం లోని బ్రూస్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజ్ కాటన్, ముకుంద కలెక్షన్, తదితర దుకాణాల్లో చొరబడి నగదు, వస్తు సామగ్రి చోరీ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ యంత్రాన్ని దోచుకెళ్లారు. సీఐ మాంతేష్ తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సంఘటనతో వ్యాపారులు, నగర వాసులు ఆందోళనకు గురయ్యారు.
నైతిక విలువలు నశించాయి
రాయచూరు రూరల్: సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయని రాయచూరు దక్షిణ విద్యా శాఖ అధికారి రావుత్‌రావ్ పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్ధరామ జంబలదిన్నె రంగ మందిరంలో స్టెప్పింగ్ స్టోన్ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మానవీయ విలువలను వివరించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. సంస్కృతి, ఆచారం, విచారం, సనాతన సంప్రదాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ సన్న వీరేష్, జితేంద్ర, లాలాజీ, గీత, సీఐ నింగప్ప, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు అందజేత
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవీయ విలువలు కలిగి ఉండాలని మాన్వి శానన సభ్యుడు హంపయ్య నాయక్, నేత రవి పేర్కొన్నారు. తాలూకాలోని పోత్నాల్ స్నేహ జ్యోతి పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు మరచి ప్రజలంతా సామరస్య జీవనం సాగించాలన్నారు. తల్లి తండ్రి, గురువు దైవమనే భావాలను విద్యార్థులకు నేర్పాలన్నారు.
ఆరోగ్యం, పరిసరాలు
పుస్తకం విడుదల
రాయచూరు రూరల్: సమాజ సేవకు యువతీ, యువకులు సంసిద్ధులు కావాలని భారత వైద్యకీయ సంఘం మాజీ అధ్యక్షుడు రవిరాజేశ్వర్ పిలుపునిచ్చారు. నగరంలోని భారత వైద్యకీయ సంఘం భవనంలో డా.అరవింద్‌పటేల్ రాసిన అరోగ్యం–పరిసరాల పుస్తకాన్ని ఆయన విడుదల చేసి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావి తరాల మనుగడకు తోడ్పడాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం విస్మరించరాదని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలేష్, రావు తరావ్, సురేష్ సగరద్, విజయ్ రాజేంద్ర, శివానంద, అరవింద పటేల్, ఇందిర, సుశ్రిత, తదితరులు పాల్గొన్నారు.
విడాకులకు వెళ్లి.. జంటగా ఇంటికి
సాక్షి, బళ్లారి: చిన్న విబేధాలతో విడాకులు కోరుకుని కోర్టును ఆశ్రయించిన మూడు జంటలకు.. న్యాయమూర్తులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఒక్కటై జంటగా కలిసి ఇంటికి వెళ్లారు. కొప్పళ కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. కారటిగి తాలూకా జూరటిగి నివాసి దావణ్ణ హుసేనప్ప, లక్ష్మీ అలియాస్ ఈరమ్మ దంపతులు, గంగావతి తాలూకా గూగిబండే నివాసి హనుమంత జరకుంటి, హుసేనమ్మ దంపతులు, వడ్డెరహట్టి నివాసి కృష్ణపాణి వెంకటేశ్వరరావు,(లెక్చరర్)సంధ్య దంపతుల మధ్య గతంలో చిన్న విబేధాలు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల కోసం భార్యా, భర్తలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ చేసిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిర్చేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు దంపతులు అంగీకరించి జంటగా కలిసి ఇంటికి వెళ్లడంతో మూడు కుటుంబాల్లో మళ్లీ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
మూడు దుకాణాల్లో చోరీ
మూడు దుకాణాల్లో చోరీ
మూడు దుకాణాల్లో చోరీ


