జనవరి 9న డీకేకు పట్టం?
అప్పటివరకు మౌనంగా ఉండాలని ఆయన నిర్ణయం
పార్టీకి ఇబ్బంది కలిగించకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని భావన
కానీ, ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా సీఎం తనయుడు యతీంద్ర వ్యాఖ్యలు
సాక్షి బెంగళూరు: కన్నడనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎం మార్పు అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ పోరుకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 9న డీకే శివకుమార్ కల తీరనున్నట్లు సమాచారం. అయితే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంఘర్షణ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్న 30 రోజుల పాటు మహామౌనం వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వివాదానికి యతీంద్ర ఆజ్యం..
బెళగావి శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో సిద్దరామయ్యే మళ్లీ సీఎం అంటూ ఆయన తనయుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు ఉండదని ఆయన పదేపదే వ్యాఖ్యానిస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. దీంతో సీఎం మార్పు వివాదం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీకి అస్త్రంగా మారింది. నిజానికి.. ఈ అంశం బీజేపీకి అస్త్రం కాకూడదని పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌ను హెచ్చరించినప్పటికీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల అభిమానులెవ్వరూ లెక్కజేయకుండా మాట్లాడుతూ పార్టీని ఇరకాటంలోకి పెడుతున్నారు.
జనవరి రెండో వారంలో డీకే సీఎం?
ప్రతిపక్షాలను బాహాటంగా చీల్చిచెండాడే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇందుకు అసలు కారణం జనవరి 9గా తెలుస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ హైకమాండ్ జనవరి రెండో వారంలో సీఎం కుర్చీపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. అప్పటివరకు పార్టీకి ఇబ్బంది కలిగించకుండా మౌనం వహించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని డీకే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. డీకే శివకుమార్‌కు దాదాపు సీఎం పీఠం ఖరారవుతున్న తరుణంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన లక్ష్యాన్ని దూరం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పైగా.. హైకమాండ్‌పట్ల విధేయత, క్రమశిక్షణ కనబరిచిన వాడిగా గుర్తింపు పొందాలని డీకే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
తనయుడికి సిద్దరామయ్య హితబోధ..
ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాల కారణంగా ఈ సీఎం కుర్చీ పోరు కాస్తా నెమ్మదించినా సమావేశాల అనంతరం మళ్లీ రాజుకునే అవకాశముంది. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్ర చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇవి డీకే వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు తన కుమారునితో సిద్దరామయ్య చర్చించారు. సున్నితమైన అంశాలను మీడియా సమక్షంలో ప్రస్తావించవద్దని తన కుమారునికి హితవు పలికినట్లు సమాచారం. ఇక యతీంద్ర వ్యాఖ్యలతో డీకే శివకుమార్ వర్గం కూడా అప్రమత్తమైంది. విధానసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం తన మద్దతుదారులతో సభలోనే డీకే ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు.


