23 ఏళ్ల తర్వాత రైలు ప్రమాద బాధిత కుటుంబానికి అందిన పరిహారం
సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ హర్షం
న్యూఢిల్లీ: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రైల్వే శాఖ దాదాపు 23 ఏళ్లకు పరిహారం అందజేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, హైకోర్టు పరిహారం అవసరం లేదంటూ తీర్పు వెలువరించినా, సుప్రీంకోర్టు జోక్యంతో యంత్రాంగం కదిలింది. రైల్వే శాఖ, పోలీసులు కలిసి వృద్ధురాలై మృతుడి భార్య జాడ కనుక్కుని పరిహారంగా రూ.8.92 లక్షలను ఆమెకు అందజేశారు.
ఈ విషయాన్ని రైల్వే శాఖ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది ఇలాంటివేనన్నారు. ‘మేం కోరుకునేది ఒక్కటే. అదే నిరుపేద మొహంలో చిరునవ్వు. అంతకుమించి మాకేం వద్దు..’అంటూ ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కూడా ఉన్నారు.
2002లో జరిగిన ఘటన ఇది.. విజయ్ సింగ్ అనే వ్యక్తి భక్తియార్‌పూర్‌లో రైలు టిక్కెట్ కొనుక్కుని భాగల్పూర్–దానాపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాగోలా లోపలికి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. కొద్దిదూరం వెళ్లాక పట్టుతప్పి, పట్టాలపై పడిపోయారు. అటుగా వచి్చన మరో రైలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పరిహారం కోసం విజయ్ సింగ్ భార్య దేవి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
విజయ్ సింగ్‌కు మతి స్థిమితం లేనందున, పరిహారానికి అర్హుడు కాదని ట్రిబ్యునల్ తోసిపుచి్చంది. అనంతరం ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నిరాశే ఎదురైంది. తీర్పును సవాల్ చేస్తూ వృద్ధురాలైన దేవీ సింగ్ తరఫున లాయర్ ఫౌజియా షకీల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. 2023 ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..రైల్వే ట్రిబ్యునల్, పట్నా హైకోర్టు ఇచి్చన తీర్పులను తప్పుబట్టింది.
మతి స్థిమితం లేని వ్యక్తి తనంతానే రైలు టిక్కెట్ ఎలా కొంటారని, పట్నా వెళ్లేందుకు తనొక్కడే ఎలా రైలు ఎక్కుతారని ప్రశ్నించింది. విజయ్ సింగ్ మృతికి కారణమైనందుకు రూ.4 లక్షల పరిహారాన్ని పిటిషన్ వేసినప్పటి నుంచి 6 శాతం వడ్డీ చొప్పున ఆయన కుటుంబానికి రెండు నెలల్లోగా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, వృద్ధురాలైన దేవీ సింగ్ తనున్న చోటు నుంచి కుటుంబసభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.
దీంతో, పరిహారం అందుకోవాలంటూ రైల్వే శాఖ రాసిన లేఖలు ఆమెను చేరలేదు. ఆమె కోసం హిందీ, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రకటనలు వేయించాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేవీ సింగ్‌కు పరిహారం అందేలా చూడాలంటూ నలంద ఎస్‌ఎస్‌పీ, భక్తియార్‌పూర్ ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేకంగా ఆదేశాలిచి్చంది. చివరికి ఎలాగోలా దేవీ సింగ్ జాడను యంత్రాంగం కనిపెట్టింది.


