breaking news
Railway Claims Tribunal
-
ముమ్మాటికీ యజమాని బాధ్యతే
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓనర్ రిస్క్ ‘(యజమాని బాధ్యత) విధానంలో బుక్ చేసిన సరుకులో కొరత ఏర్పడినా, రైల్వే అధికారులు ముందుగా ఆ సరుకును లెక్కించకపోయినా, తూకం వేయకపోయినా అందుకు ఆ శాఖను బాధ్యునిగా చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరుకు పరిమాణాన్ని రైల్వే సిబ్బంది ధ్రువీకరించినప్పుడు మాత్రమే ఆ బాధ్యత వారిపై ఉంటుందని తేల్చిచెప్పింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్ నుంచి అసోంకు రవాణా చేసిన ఉప్పు బస్తాల్లో కొరత ఏర్పడిందంటూ పరిహారం కోరిన ఎం/ఎస్ బజాజ్ ట్రేడింగ్ కంపెనీ వేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. ఏమిటీ కేసు? 2009 నవంబర్‌లో గుజరాత్‌లోని చిరాయ్ జంక్షన్ నుంచి అసోంలోని ధర్మనగర్‌కు 40,444 ఉప్పు బస్తాలను రైల్వే ద్వారా రవాణా చేశారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత 38,702 బస్తాలు మాత్రమే తమకు అందాయని, 1,742 బస్తాలు తక్కువగా ఉన్నాయని కంపెనీ ఆరోపించింది. రైల్వేలు కొరత ధ్రువీకరణ పత్రం (షార్టేజ్ సర్టీఫికెట్) జారీ చేసినప్పటికీ, ఈ సరుకు ‘ఓనర్ రిస్క్‘కింద బుక్ కావడంతో పాటు, రైల్వే రసీదుపై ‘సెడ్ టూ కంటైన్’అనే ఎండార్స్మెంట్ ఉండటంతో తమకు ఎలాంటి బాధ్యత ఉండదని రైల్వే శాఖ వాదించింది. అంటే సరుకు లోడ్ చేసే సమయంలో బస్తాల సంఖ్యను రైల్వే సిబ్బంది స్వయంగా తనిఖీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రత్యేక నిబంధనలు వర్తింపు రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 93 ప్రకారం రైల్వేలకు సాధారణ బాధ్యత ఉన్నప్పటికీ, సెక్షన్ 97 ప్రకారం ‘ఓనర్ రిస్క్ ‘పై బుక్ చేసిన సరుకుల విషయంలో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే రైల్వేలను బాధ్యులుగా భావించవచ్చని తెలిపింది. సరుకు లోడ్ చేసే సమయంలో రైల్వే అధికారులు స్వయంగా లెక్కించి లేదా తూకం వేసి ఉంటే, ఆ పరిమాణాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత వారిపై ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఈ కేసులో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఆధారాలు చూపలేదు.. రైల్వే చట్టంలోని సెక్షన్ 65(2) ప్రకారం, రైల్వే సిబ్బంది సరుకును లెక్కించకుండా రసీదుపై సంబంధిత ఎండార్స్మెంట్ చేసినట్లయితే, వాస్తవంగా ఎంత సరుకు పంపారో నిరూపించే బాధ్యత సరుకు పంపిన వ్యక్తి లేదా స్వీకరించే వ్యక్తిపైనే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో 40,444 ఉప్పు బస్తాలను నిజంగా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, రవాణాకు సిద్ధం చేసినట్లు చూపించే ఎలాంటి పత్రాలను కంపెనీ సమర్పించలేదని ధర్మాసనం గుర్తించింది. అందువల్ల అవసరమైన ఆధారాలు సమర్పించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో, ‘ఓనర్ రిస్క్ ‘విధానంలో బుక్ చేసిన సరుకుల విషయంలో రైల్వేల బాధ్యతకు సంబంధించి కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లయింది. -
సామాన్యుడి మొహంలో చిరునవ్వే మేం కోరుకునేది
న్యూఢిల్లీ: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రైల్వే శాఖ దాదాపు 23 ఏళ్లకు పరిహారం అందజేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, హైకోర్టు పరిహారం అవసరం లేదంటూ తీర్పు వెలువరించినా, సుప్రీంకోర్టు జోక్యంతో యంత్రాంగం కదిలింది. రైల్వే శాఖ, పోలీసులు కలిసి వృద్ధురాలై మృతుడి భార్య జాడ కనుక్కుని పరిహారంగా రూ.8.92 లక్షలను ఆమెకు అందజేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది ఇలాంటివేనన్నారు. ‘మేం కోరుకునేది ఒక్కటే. అదే నిరుపేద మొహంలో చిరునవ్వు. అంతకుమించి మాకేం వద్దు..’అంటూ ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కూడా ఉన్నారు. 2002లో జరిగిన ఘటన ఇది.. విజయ్ సింగ్ అనే వ్యక్తి భక్తియార్‌పూర్‌లో రైలు టిక్కెట్ కొనుక్కుని భాగల్పూర్–దానాపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాగోలా లోపలికి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. కొద్దిదూరం వెళ్లాక పట్టుతప్పి, పట్టాలపై పడిపోయారు. అటుగా వచి్చన మరో రైలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పరిహారం కోసం విజయ్ సింగ్ భార్య దేవి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విజయ్ సింగ్‌కు మతి స్థిమితం లేనందున, పరిహారానికి అర్హుడు కాదని ట్రిబ్యునల్ తోసిపుచి్చంది. అనంతరం ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నిరాశే ఎదురైంది. తీర్పును సవాల్ చేస్తూ వృద్ధురాలైన దేవీ సింగ్ తరఫున లాయర్ ఫౌజియా షకీల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. 2023 ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..రైల్వే ట్రిబ్యునల్, పట్నా హైకోర్టు ఇచి్చన తీర్పులను తప్పుబట్టింది. మతి స్థిమితం లేని వ్యక్తి తనంతానే రైలు టిక్కెట్ ఎలా కొంటారని, పట్నా వెళ్లేందుకు తనొక్కడే ఎలా రైలు ఎక్కుతారని ప్రశ్నించింది. విజయ్ సింగ్ మృతికి కారణమైనందుకు రూ.4 లక్షల పరిహారాన్ని పిటిషన్ వేసినప్పటి నుంచి 6 శాతం వడ్డీ చొప్పున ఆయన కుటుంబానికి రెండు నెలల్లోగా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, వృద్ధురాలైన దేవీ సింగ్ తనున్న చోటు నుంచి కుటుంబసభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో, పరిహారం అందుకోవాలంటూ రైల్వే శాఖ రాసిన లేఖలు ఆమెను చేరలేదు. ఆమె కోసం హిందీ, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రకటనలు వేయించాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేవీ సింగ్‌కు పరిహారం అందేలా చూడాలంటూ నలంద ఎస్ఎస్పీ, భక్తియార్పూర్ ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేకంగా ఆదేశాలిచి్చంది. చివరికి ఎలాగోలా దేవీ సింగ్ జాడను యంత్రాంగం కనిపెట్టింది. -
క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సభ్యులను నియమించాలి
రైల్వే ప్రమాద బాధిత కుటుంబాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రమాదాల్లో గాయపడిన, చనిపోయిన కుటుంబాలు పరిహారానికి దాఖలు చేసుకునే పిటిషన్లను విచారించే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు బాధితులు మంగళవారం సికింద్రాబాద్ సమీపంలోని ట్రిబ్యునల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాదాపు 4 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ట్రిబ్యునల్‌లో సభ్యులు లేని కారణంగా విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతోందని, దీంతో నష్ట పరిహారం అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంపై ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేసినా సభ్యులు లేకపోవడంతో విచారించే పరిస్థితి లేదన్నారు. చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో సభ్యులను నియమించే దిక్కు లేకుండా పోయిం దన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం.పాండురంగారావు, కృష్ణమోహన్‌రావు, గిరికుమార్, గీతామాధురి, ద్వారకానాథ్ పట్నాయక్‌లు పాల్గొన్నారు.


