అర్జెంట్ లిస్టింగ్ కేసులపై లిఖితపూర్వక సమాచారమివ్వాలిసిందే
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు
నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
తొలిరోజే 17 కేసుల విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం తొలిరోజే తనదైన శైలిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసుల విషయంలో నూతన నిబంధన విధించారు. అర్జెంట్‌గా విచారణ చేపట్టాల్సిన కేసుల గురించి నోటిమాటగా విజ్ఞప్తి చేయడం ఆపాలని, ఇకపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఒక కాగితంపై కేసు వివరాలు రాసి ఇస్తే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిశితంగా పరిశీలిస్తుందని, తమ దృష్టికి తీసుకొస్తుందని అన్నారు. మరణ శిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నోటిమాటగా వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అర్జెంట్ లిస్టింగ్ కేసుల విచారణలో న్యాయవాదులు ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల గురించి న్యాయవాదులు నోటిమాటగానే సంబంధిత ధర్మాసనం దృష్టికి తీసుకురావడం చాలాఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. జస్టిస్ సూర్యకాంత్ సీజేఐ హోదాలో కేవలం రెండు గంటల వ్యవధిలో ఏకంగా 17 కేసులను విచారించారు.
జస్టిస్ సూర్యకాంత్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ప్రమాణ స్వీకారం తర్వాత సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్ తొలుత మహాత్మాగాం«దీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఒకటో నంబర్ కోర్టుగదిలో త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించి, కేసుల విచారణ ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థకు మధ్య వివాదంలో తీర్పు వెలువరించారు. తర్వాత సుప్రీంకోర్టు అడ్వొకేట్స్–ఆన్–రికార్డు అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్ నాయర్.. జస్టిస్ సూర్యకాంత్‌కు సాదర స్వాగతం పలికారు. సాధారణ కుటుంబంలో జని్మంచి, సీజేఐ స్థాయికి చేరుకోవడం స్ఫూర్తిదాయకం అంటూ ఓ న్యాయవాది కొనియాడారు. ఆయనకు జస్టిస్ సూర్యకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.


