సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని గంపగుత్తగా ఎఫ్ఐఆర్‌లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌లపై ఆరు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.
అలాగే, ప్రతివాదులను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లపై, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్‌లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధక చట్టం కింద పలువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది.


