సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్‌లూ, సల్ఫేట్‌లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి.
నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.
రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు.
అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి.
ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్‌లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది.
సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి.


