వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం.
వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్‌ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్‌వుడ్ క్వీన్‌గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్‌ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు.
కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.


