హుబ్లీ: కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి, లంచం కేసుల్లో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదగ్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆస్పత్రిపై లోకయుక్త అధికారులు దాడి చేశారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ఇద్దరు పీఏలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్ననీటి పారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్‌ని ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారని, అందులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ పీఏ రూ.50 వేల నగదున్న కవరును బయటకు విసిరేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
కాగా, ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, దాడిలో పాల్గొన్నారు. నగదు డిమాండ్ చేస్తూ విజయ్‌కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్లు సమాచారం. అరెస్టు గురించి విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్‌కు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.


