వెండితెర చాందినీ | Remembering the Athiloka Sundari Sridevi death anniversary | Sakshi
Sakshi News home page

వెండితెర చాందినీ

Feb 24 2026 5:40 AM | Updated on Feb 24 2026 5:40 AM

Remembering the Athiloka Sundari Sridevi death anniversary

స్మరణ

 నేడు శ్రీదేవి వర్థంతి

ప్రేక్షకులు ‘పదహారేళ్ల వయసు’ దగ్గర ఆగిపోయారు. అభిమానులు ‘వేటగాడు’ వానలో తడిసి ముద్దవుతూనే ఉన్నారు. కుర్రకారుకి వయసు మీరినా ‘ప్రేమాభిషేకం’ వద్ద మఠం వీడలేదు. మహిళా హృదయాలలో ‘కార్తీక దీపం’ వెలిగించిన ‘దేవత’ ‘అతిలోక సుందరి’గా ఎప్పటికీ ఉండిపోతుందనుకున్నారు. శ్రీదేవి వీడిపోయి ఎనిమిదేళ్లు. కాని ‘దేవుడా... దేవుడా.. దేవుడా’ అని ముద్దులొలికే ఈ గుంటూరు అమ్మాయి మరపునకు రాదే. ఈ బాధ తీరిపోదే.

మీకు ఆనందం కలిగించే విషయం ఏది? ‘నాకు నీళ్లలో షూటింగ్‌ అన్నా, నీళ్లతో ఆడుకోవాలన్నా చాలా ఇష్టం. ఈత కూడా వచ్చు. నీళ్లతో ఆడితే ఆనందంగా ఉంటుంది’
నీరంటే ఇష్టపడే ఈ నటి, ఈత తెలిసిన ఈ నటి, పిల్లలు కూడా మునిగి మరణించలేని బాత్‌టబ్‌లో నిర్జీవంగా చివరిసారిగా అభిమానులకు కనిపించింది.

తల్లిదండ్రులు పిల్లల మనసుకెక్కేలా మాట్లాడితే ఇక జీవితాంతం వదలవు. శ్రీదేవి సినిమాల్లో ఎదుగుతున్నప్పుడు ‘నిజాయితీగా పని చెయ్‌. అది నిన్ను కాపాడుతుంది’ అని తండ్రి అయ్యప్పన్‌ అన్నారు. శ్రీదేవి అలాగే పని చేసింది. తల్లి రాజేశ్వరమ్మ శ్రీదేవికి మూడు మాటలు చెప్తారు. 
1. హీరోయిన్‌కి ముక్కు చక్కగా ఉండాలి. 
2. మనసులోని మాట పెదవి దాటకూడదు. 
3. పెదాలపై ఎప్పుడూ నవ్వు మెరుస్తూ ఉండాలి.... శ్రీదేవి పెదాలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. 

శ్రీదేవి మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడిందే లేదు. ఇక ముక్కు సంగతి?

‘బొబ్బిలిపులి’ వచ్చినప్పుడు నేల, బెంచీ క్లాసుల్లో ఉన్న ఆడవాళ్లు ఆ సినిమా చూసి ఇళ్లకొచ్చి భర్త అన్నం తింటుంటే ‘శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్‌ చేయించుకుందట’ అని చెప్పి వింత పోవడమే. ఆ సినిమాలో శ్రీదేవి కొన్ని సీన్లలో సర్జరీ చేయని ముక్కుతో, కొన్ని సీన్లలో సర్జరీ చేసిన ముక్కుతో కనపడుతుంది. ఆ సీజన్‌లో వచ్చిన సినిమాలలో శ్రీదేవి ఇలా రెండు విధాలుగా కనిపిస్తుంది. ముక్కుకు ఆపరేషన్‌ చేయించుకోవడం అనే మాట సామాన్యులు దక్షిణాదిన వినడం బహుశా అదే ప్రథమం. శ్రీదేవి తన ముక్కును మరణించే ముందు వరకూ సరి చేయించుకుంటూనే ఉంది. ఆ ముక్కు క్షీణించి క్షీణించి ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సమయానికి శ్రీదేవిని శ్రీదేవి కాకుండా చేసింది.

కొందరు అమ్మాయిలు ఎంత చక్కగా ఉన్నా దర్శకులు, నిర్మాతలు హీరోయిన్లుగా చేయరు. సినిమా కమర్షియల్‌ వ్యాపారం. మగవాళ్ల ఆదరణ పైచేయిగా ఆధారపడిన వినోద కళ. సినిమాకు వచ్చిన సగటు ప్రేక్షకుడికి తెర మీద హీరోయిన్‌ గ్లామరస్‌గా కనపడాలి. అయస్కాంతంలా లాగాలి. నేల క్లాసు ప్రేక్షకుడి భాషలో చెప్తాలంటే ‘సిస్టర్‌ పీలింగ్‌’ తేకూడదు. ఆ సమయానికి స్టార్లుగా ఉన్న జయసుధ, జయప్రద ప్రధానంగా పెర్ఫార్మెన్స్‌ మీద ఆధారపడిన పాత్రలు చేసేవారు. మోడ్రన్‌ దుస్తులు వారికి అంతగా నప్పేవి కావు. కాని శ్రీదేవి పెర్ఫార్మెన్స్‌ చేయగలదు. మోడ్రన్‌గా కనిపించగలదు. యువతరం కోరుకునే గ్లామర్‌ ఆమెలో అతి సహజంగా మెరిసేది. ‘వేటగాడు’లో మేక్సీలో ‘జాబిలితో చెప్పనా’ పాడితే ఊళ్లో ఆడపిల్లలంతా మేక్సీలు కుట్టించుకోవడమే. ‘వేటగాడు’కు ముందు ఎన్టీఆర్‌కు చాలామంది హీరోయిన్లు. ‘వేటగాడు’ తర్వాత శ్రీదేవి మాత్రమే హీరోయిన్‌– ఒకటీ అరా తప్ప.

నాగేశ్వరరావు ప్రేమిస్తాడు. ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ చూపించాలంటే ఆ ప్రేమికురాలు శ్రీదేవి అయితేనే సాధ్యం. ‘ఈ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వొచ్చురా’ అనేలా నాగేశ్వరరావుకే కాదు కాలేజీ ఎగ్గొట్టి హాల్లో దూరిన కుర్రమొఖానికి కూడా అనిపించాలి. అందుకు శ్రీదేవే సరిపోతుందని దాసరికి తెలుసు. ‘ప్రేమాభిషేకం’ అక్కినేని సినిమాయే. శ్రీదేవి వల్ల కూడా అక్కినేని సినిమా. ఆ తరువాత అక్కినేని కెరీర్‌ కొంచెం డల్‌గా ఉన్నçప్పుడు శ్రీదేవితో కలిసి నటించిన ‘శ్రీరంగనీతులు’ మరో హిట్‌గా నిలిచింది. ‘తొంగి తొంగి చూడమాక చందమామా... నీ సంగతంత తెలుసులే చందమామా’...

హీరోలకు తమ సబ్జెక్ట్‌లు రొటీన్‌ అవుతున్నాయనుకున్నప్పుడల్లా గ్లామర్‌ యాడ్‌ చేస్తే ఆడతాయని తెలుసు. కృష్ణ, శ్రీదేవి జంట కృష్ణకు ప్లస్‌ అయ్యింది. ‘ఖైదీ రుద్రయ్య’ అనే సినిమా పేరు గుర్తుందా? కృష్ణ నటించిన ఆ సినిమా కూడా హిట్‌ అయ్యింది. శ్రీదేవి గ్లామర్‌ అప్పుడు పీక్‌లో ఉంది. సరిగా ఆడలేదుకాని కృష్ణ, శ్రీదేవి నటించిన ‘మహారాజశ్రీ మాయగాడు’లో వారిద్దరి కామెడీ బాగుంటుంది.  అంతెందుకు... సినిమాలు ఢమాల్‌ ఢిమేల్‌ అంటున్న సమయాన అమితాబ్‌ శ్రీదేవికి రోజూ లారీడు (నిజంగానే) ఫ్లవర్‌ బొకేలు పంపి ‘ఆఖరీ రాస్తా’లో హీరోయిన్‌గా నటించేలా ఒప్పించి, హిట్‌ చేసుకుని బతికాననుకున్నాడు.

శ్రీదేవి ఎవరికైనా రుణపడి ఉండాలి అనంటే దర్శకుడు  కె.రాఘవేంద్రరావుకే. ఆయన శ్రీదేవిని ‘వేటగాడు’తో తెలుగులో స్టార్‌ని చేశాడు. హిందీలో ‘హిమ్మత్‌వాలా’తో. ఈ రాఘవేంద్రరావే శ్రీదేవి స్టార్‌డమ్‌ జత చేసి నాగార్జునకు ‘ఆఖరి పోరాటం’, చిరంజీవికి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి మెగాహిట్స్‌ ఇచ్చాడు. శ్రీదేవి వల్ల అనిల్‌ కపూర్‌ ‘మిస్టర్‌ ఇండియా’తో, రిషి కపూర్‌ ‘చాందినీ’తో పెద్ద హిట్స్‌ చూశారు. ‘ఖుదాగవా’కు శ్రీదేవి సైన్‌ చేసిందని విని అమితాబ్‌ గంతులేశాడు. ఒక దశలో జితేంద్ర మూడుపూట్ల భోజనం శ్రీదేవి సమేత సినిమాలతో గడిచిపోయింది.

శ్రీదేవి ‘క్షణక్షణం’లో నటించి ఒక కల్ట్‌ క్లాసిక్‌ మనకు మిగిల్చి పోయింది ఆఖరుగా. ఆమె ఆఖరి బింబాన్ని ఆ సినిమాతో ఆపుకుంటేనే అభిమానులకు సంతోషం. 50 ఏళ్లు నటించిన జీనియస్‌ నటి శ్రీదేవి.మరో నూటయాభై ఏళ్లు గడిచినా స్మరణకు వస్తూనే ఉంటుంది.

శ్రీదేవి గొప్పనటి. తమిళం వారే అది ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ‘ఆకలి రాజ్యం’లో శ్రీదేవి నటన చూడాలి. నిజ జీవితంలో ఏమీ చదువుకోని శ్రీదేవి ఆ 
సినిమాలో ఇంటెలెక్చువల్‌గా, మెచ్యూర్డ్‌ పర్సనాలిటీతో కనిపిస్తుంది. కమల్‌ హాసన్‌ అందరినీ మింగేయవచ్చు షాట్‌లో. గొంతుకు అడ్డం పడే రకం శ్రీదేవి. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ పెద్ద హిట్‌గానీ దురదృష్టవశాత్తు ఆ ప్రింట్‌ ఎక్కడా లేదు. శ్రీదేవి కామిక్‌ టైమ్‌కి ఆ సినిమా మంచి ఉదాహరణ. ఈ కామిక్‌ టైమింగ్‌తో శ్రీదేవి హిందీలో ‘చాల్‌బాజ్‌’లో చెలరేగితే బాలీవుడ్‌ డంగైపోయింది. ‘చాల్‌బాజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌. అందులో రజనీకాంత్, సన్నీడియోల్‌ హీరోలు. ఎవరికీ గుర్తుండరు.

– ఫ్యామిలీ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement