న్యూఢిల్లీ: రాష్ట్రపతి లేనప్పుడు ఆయన విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తుండగా రాజ్యసభ చైర్మన్ లేని వేళ ఆయన అధికారాలను డిప్యూటీ చైర్మన్ ఎందుకు చలాయించరాదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్‌సీ శర్మల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. తనపై వచి్చన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే అధికారం పార్లమెంటరీ కమిటీకి లేదని జస్టిస్ వర్మ పేర్కొన్నారు.
న్యాయమూర్తు(విచారణ)చట్టం–1968 ప్రకా రం.. స్పీకర్‌కు లేదా రాజ్యసభ చైర్మన్‌కు మాత్రమే న్యాయమూర్తిపై ప్రవేశపెట్టే తీర్మానాన్ని తిరస్కరించే– అనుమతించే అధికారం ఉంటుందని జస్టిస్ వర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉండగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడటం తీవ్ర సంచలనం రేపింది. ఈ పరిణామం అనంతరం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ వర్మ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రొహత్గి, సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. చైర్మన్ లేని సమయంలో, ఆయనకున్న విచక్షణాధికారాలను డిప్యూటీ చైర్మన్ చలాయించలేరన్నారు. వాదనలు విన్న ధర్మాసనం అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత పక్షాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


