సాక్షి, ఢిల్లీ: దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులిటెన్ ద్వారా వెల్లడించింది. వీళ్లలో దశాబ్ధాలుగా రాణిస్తూ.. రాజకీయ ధురంధరులుగా పేర్లున్న నేతలు కూడా ఉన్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్(నామినేటెడ్ ఎంపీ) టర్మ్‌లు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్లీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఆయన పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ జరిగింది. దీంతో అనుమానాలు నెలకొన్నాయి.
మిగతా వాళ్లలో.. వయసు రిత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి నలుగురు ఉండగా, అందులో జూన్ 21వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. తెలుగు దేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్ కానున్న ఇద్దరు ఎంపీలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ రిటైర్ కానున్నారు.
మొత్తం 73 సీట్లలో 72 సీట్లకుగాను ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతో ఎన్డీఏ (NDA) కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని.. మొత్తం 145 సీట్లు వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అలాగే.. విపక్ష ఇండియా బ్లాక్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని సమాచారం. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్‌లో రెండు విడతలలో జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రాల వారీగా రిటైర్ కానున్న ఎంపీల సంఖ్య
మహారాష్ట్ర :4 ఎంపీలు
ఒడిశా :4
తమిళనాడు :6
పశ్చిమ బెంగాల్ :5
అస్సాం :3
బీహార్ :5
చత్తీస్గడ్ :2
హర్యానా: 2
హిమాచల్ ప్రదేశ్ :1
గుజరాత్ 4
జార్ఖండ్ 2
మధ్యప్రదేశ్ 3
మణిపూర్ :1
మేఘాలయ :1
రాజస్థాన్ :3
అరుణాచల్ ప్రదేశ్ :1
కర్ణాటక: 4
మిజోరం :1
యూపీ :10
ఉత్తరాఖండ్ : 1


