న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రూ.50 లక్షల బీమా పరిహారానికి అర్హమైనవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పీఎంజీకేవై ప్యాకేజీకి ప్రైవేట్ వైద్యులు అర్హులు కారంటూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం పక్కనబెట్టింది.
చట్టాలు, నిబంధనల ప్రకారం వైద్యులకు ఉపయోగపడేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. పైపెచ్చు, కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వైద్యులకు, ఆరోగ్య నిపుణులకు యావత్తూ దేశం దన్నుగా ఉంటుందనే హామీ ఇవ్వడానికి ఉద్దేశించిన బీమా పథకమిది’అని ధర్మాసనం తెలిపింది. ‘పీఎంజీకేవై–ప్యాకేజీ కింద చేసిన బీమా కోసం వ్యక్తిగత క్లెయిమ్‌లు చట్టానికి లోబడి రుజువుల ప్రాతిపదికన పరిశీలించాలి. అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలి’అని పేర్కొంది.
‘కోవిడ్ సంబంధిత విధి నిర్వహణలోనే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు నిరూపించే బాధ్యత క్లెయిమ్ చేసిన కుటుంబీకులపై ఉంటుంది. నమ్మదగిన సాక్ష్యం ఆధారంగా దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తేనే తప్ప, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు పీఎంజీకేవై ప్యాకేజీ వర్తించదంటూ బాంబే హైకోర్టు 2021లో వెలువరించిన తీర్పును ప్రదీప్ అరోరా తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
అంతకుముందు, మహారాష్ట్రలోని థానెలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యుడైన తన భర్త 2020లో కోవిడ్ సమయంలో చనిపోయారని, పీఎం జీకేవై ఆయనకు వర్తింప జేయాలంటూ కిరణ్ భాస్కరే సుర్గాడే వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పనిచేసే ఆస్పత్రిని కోవిడ్–19 ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించనందున బీమా వర్తింజేయలేమని బీమా కంపెనీ తెలిపింది. కోవిడ్ సేవల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 2020 మార్చిలో పీఎంజీకేవైను ప్రకటించింది.


