వార్తా చానల్‌ను అంధకారంలోకి నెట్టేయడం అత్యంత తీవ్రమైన అంశం
బాబు సర్కారుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం
ఇది ముమ్మాటికీ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని మండిపాటు
ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరపాలని టీడీ శాట్‌కు ఆదేశాలు
‘సాక్షి’ గొంతు నొక్కాలన్న కుతంత్రంపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీత
ప్రసారాల నిలిపివేతపై తీవ్ర ఆగ్రహం.. బాబు సర్కార్‌కు మొట్టికాయలు
ట్రిబ్యునల్ విచారణను మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం
వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు
ప్రభుత్వం మారాక కక్షగట్టారు.. ఫైబర్ నెట్ అబద్ధాలు ఆడుతోంది
‘సాక్షి’ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదన
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘సాక్షి’ టీవీపై సాగిస్తున్న కక్షసాధింపు చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒక వార్తా చానల్‌ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడం (కంప్లీట్ బ్లాక్ ఔట్) అత్యంత తీవ్రమైన అంశం’’ అని మండిపడింది.
ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని టెలికం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీ శాట్)ను ఆదేశించింది. పూర్తిగా ప్రసారాలు నిలిపివేసిన తరుణంలో... ట్రిబ్యునల్ తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణను ముందే ముగించాలని టీడీ శాట్‌ను ఆదేశించింది.
ఇది అత్యవసరమని, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. చానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల గొంతుకను అణచివేస్తున్నారు
‘‘ఏపీలో ప్రభుత్వం మారిన కేవలం రెండు వారాల్లోనే, రాజకీయ దురుద్దేశంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. 2024 జూన్ 3 వరకు ప్రజలకు అత్యంత చేరువలో ఉన్న చానల్‌ను జూన్ 20 తర్వాత కుట్రపూరితంగా అడ్డుకున్నారు’’ అని ‘సాక్షి’ టీవీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వకుండా, వెనుక ఉండి ఎంఎస్‌వోలను భయభ్రాంతులకు గురిచేస్తోందని రోహత్గీ వాదించారు.
ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, కేవలం మౌఖిక ఆదేశాలతో సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా చానల్‌ను ఆపేశామని చెబుతున్నారే తప్ప, కనీసం వినియోగదారుడు కోరుకుంటే ఇచ్చే పద్ధతిలోనూ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని నివేదించారు. మీడియా స్వేచ్ఛను బాబు సర్కారు కాలరాస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఫైబర్‌నెట్ నుంచే కుట్ర
సాక్షి ప్రసారాల నిలిపివేత కుట్రలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఫైబర్‌నెట్ ప్రధాన పాత్ర పోషిస్తోందని సాక్షి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వ్యవహారంపై గతంలోనే ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ పటేల్ తీవ్రంగా స్పందించారని, ఫైబర్ నెట్ అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారని రోహత్గీ ప్రస్తావించారు. అయినా, ప్రభుత్వం తీరు మారలేదని, బ్లాక్ ఔట్ కొనసాగుతూనే ఉందని తెలిపారు.


