సుప్రీంకోర్టు సూచనతో కోర్టుకు హాజరైన పిన్నెల్లి సోదరులు
ఈ సందర్భంగా మాచర్లలో ఎక్కడికక్కడ బారికేడ్లు
వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపులా తనిఖీలు
సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేతలు రాకుండా అడ్డగింపు
దుకాణాలు, హోటళ్లు మూసివేత.. అక్రమ నిర్బంధాలు.. బెదిరింపులు
నీచ రాజకీయాలకు త్వరలోనే చరమగీతం: నేతల మండిపాటు
అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు.
అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు.
గృహ నిర్బంధాలు.. బెదిరింపులు
పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్‌రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్‌ను నడుపుతున్నారని మండిపడ్డారు.
నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్‌పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్‌రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


