వైఎస్ వివేకా హత్య కేసులో పాఠకులను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనం
కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి వైఎస్ అర్జున్ రెడ్డి ఫోన్‌కు మెసేజ్‌పై వక్రీకరణ
అర్ధరాత్రి 1.42 గంటలకే మెసేజ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
యూటీసీ కాలమానానికి– భారతీయ కాలమానానికి 5.30గంటల తేడాను ఉద్దేశపూర్వకంగా విస్మరించిన పచ్చపత్రిక
మెసేజ్ వెళ్లింది భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.12 గంటలకు..
వివేకా హత్య విషయం ఉదయం 6.30 గంటలకే అందరికీ తెలిసింది
ఇక 7.12 గంటలకు మెసేజ్ వెళ్లడంతో అసాధారణం ఏముంది?
పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాఠకులను తప్పుదారి పట్టించేందుకు పచ్చ పత్రిక ఈనాడు కుతంత్రాలను కొనసాగిస్తూనే ఉందని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి గురువారం విమర్శించారు. అందుకోసం తనదైన శైలిలో వక్రీకరణకు, దుష్ప్రచారానికి తెగబడుతోందని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, అధికారికంగా ఉత్తర్వుల కాపీ అందకుండా.. సీబీఐ దర్యాప్తునకు పాక్షిక అనుమతి వార్తను ప్రచురిస్తూ, తప్పుడు సమయాన్ని ముద్రించి పాఠకులకు అనుమానాలు కలిగేలా చేయాలని కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసును మరింత లోతైన దర్యాప్తునకు సీబీఐని ఆదేశించాలన్న సునీత పిటిషన్‌పై వెలువడిన పాక్షిక అనుమతి వార్తను ‘ఉత్తర్వుల కాపీ అందకుండానే’ వక్రీకరించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అర్ధరాత్రి 1.42 గంటలకే హత్య వార్త మెసేజ్ కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్‌రెడ్డి మొబైల్ ఫోన్‌కు వెళ్లిందని పాఠకుల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు ఎల్లో మీడియా కథనాన్ని ప్రచురించిందన్నారు. యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్(యూటీసీ) కాలమానానికి, భారతీయ కాలమానం అయిన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టీ)కి తేడా కూడా గుర్తించకుండా విష ప్రచారానికి పాల్పడుతుండడాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఎండగట్టారు.
ఈ అంశంపై పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఈ హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు వైఎస్ అర్జున్ రెడ్డి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని సునీత తన పిటిషన్‌లో కోరారు. అదే విషయాన్ని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే ఉత్తర్వులు రాకముందే చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని షురూ చేసింది. సునీత తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఎల్లోమీడియా యత్నిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఆయన మీడియాకు వివరించారు.
వక్రీకరణకు నిలువుటద్దం
కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి 2019, మార్చి 14న అర్ధరాత్రి యూటీసీ కాలమానం ప్రకారం 1.42.42 గంటలకు అర్జున్‌రెడ్డి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వెళ్లిందని సీబీఐ వెల్లడించింది. అంటే యూటీసీ సమాయానికి 5.30 గంటల సమయం కలిపితే భారతీయ కాలమానం ఐఎస్‌టీ వస్తుంది. ఆ ప్రకారం 1.42 గంటలకు 5.30 గంటల సమయం కలిపితే... ఉదయం 7.12 గంటలు అవుతుంది.
అంటే కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్‌రెడ్డి మొబైల్ ఫోన్‌కు 2019, మార్చి 15 ఉదయం 7.12 గంటలకు వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని మెసేజ్ వచ్చింది. అయితే ఎల్లో మీడియా పాఠకులను తప్పుదారి పట్టిస్తూ అసత్య కథనాన్ని వండి వార్చింది. అర్ధరాత్రి 1.42 గంటలకే హత్య వార్త మెసేజ్ కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్‌రెడ్డి మొబైల్ ఫోన్‌కు వెళ్లిందని పాఠకుల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు ఎల్లో మీడియా కథనాన్ని ప్రచురించింది.
‘యూటీసీ’కి 5.30గంటల తరువాత ‘ఐఎస్‌టీ’
గూగుల్, ఇతర అంతర్జాతీయ సంస్థలు, దర్యాప్తు సంస్థలు తమ రికార్డుల్లో అంతర్జాతీయ కాలమానం అంటే యూటీసీని నమోదు చేస్తాయి. వాటిని వివిధ దేశాలు తమ కాలమానానికి అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఇది అంతర్జాతీయంగా సర్వసాధారణ ప్రక్రియ. ఇక యూటీసీ కాలమానం కంటే భారతీయ కాలమానం ఐఎస్‌టీ 5.30 గంటల తరువాత ఉంటుంది.
అంటే యూటీసీలో పేర్కొన్న సమయానికి 5.30గంటలు కలిపితే భారతీయ కాలమానం– ఐఎస్‌టీ వస్తుంది. ఇది హైస్కూల్లోనే విద్యార్థులకు బోధించే విషయం. అదేమీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిందీ కాదు. ఎవరికీ తెలియంది కూడా కాదు. అయినా సరే ఎల్లోమీడియా ఆ విషయాన్ని విస్మరిస్తూ దుష్ప్రచారానికి యత్నిస్తున్నాయి.


