ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు
సాక్షి, అమరావతి : రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రధానంగా భూముల విషయాలపై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ అంశాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించేందుకు మంత్రులందరూ దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారధి చెప్పారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
భూ రికార్డులను ట్యాంపర్ చేయడంతో పాటు నలుగురు అన్నదమ్ములుండే కుటుంబంలో మొత్తం ఆస్తిని ఒకరే రాయించుకోవడం, ఎటువంటి ఆధారాలు లేకుండా భూములను 22–ఏలో పెట్టడం, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వక పోవడం, రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి సమస్యలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారన్నారు.
మంత్రులందరూ ప్రత్యేక దృష్టితో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు మొత్తం భూ రికార్డులను ట్యాంపరింగ్‌కు ఆస్కారం లేకుండా బ్లాక్ చైన్‌లో ఉంచాలని ఆదేశించారని చెప్పారు. భవిష్యత్‌లో రెవెన్యూ, భూముల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇలా..
» అమృత–2 పథకం కింద పట్టణ స్థానిక సంస్థల్లో రూ.9,514.63 కోట్లతో 506 ప్రాజెక్టులు చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం. మిగిలిన 281 ప్రాజెక్టులను లంప్సమ్ విధానంలో ప్యాకేజీలుగా విభజించి అమలు చేసేందుకు అనుమతి మంజూరు.
» అమరావతిలో లోక్‌భవన్ నిర్మాణాన్ని ఎల్–1 బిడ్డర్‌కు అప్పగించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.
» ఏపీలోని ఎన్‌హెచ్–16తో అనుసంధానించే 3.5 కిలోమీటర్ల మేర ఇ–3 రోడ్డు (ఫేస్–3) విస్తరణ ప్యాకేజీని రూ.532.55 కోట్లకు ఎల్–1 బిడ్డర్‌కు ఇచ్చేందుకు ఏడీసీఎస్ చైర్మన్‌కు అనుమతి.
» చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పలార్ నదిపై చెక్‌డ్యామ్ మరమ్మతులకు రూ.15.96 కోట్లు.. సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం.
» గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 227 మంది తెలుగు పండిట్లు, 91 మంది హిందీ పండిట్లు, 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మొత్తం 417 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం.
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్ నిర్మాణం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.
» కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రిజన్స్ చట్టం–2023ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం –2025 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఇందులో భాగంగా ప్రిజన్స్ చట్టం –1894, ప్రిజన్స్ చట్టం–1900, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రిజన్స్ చట్టం 1950లను రద్దు చేస్తూ కొత్త చట్టం అమలుకు కేబినెట్ ఆమోదం. ముసాయిదా బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు.
» ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో పలు క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు, సంస్థలకు, పర్యాటక ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం.


