రాజధానిలో తుళ్లూరు, పిచ్చుకలపాలెం
చెరువులను కబ్జా చేసి, వాటిలో రైతులకు ప్లాట్లు
టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దల సన్నిహితులకూ వీటిలో ప్లాట్లు!
దొండపాడు చెరువును కబ్జా చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం
సుప్రీం కోర్టు, ఎన్‌జీటీ తీర్పులనూ అపహాస్యం చేస్తున్న బాబు సర్కారు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఆ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. తొలి దశ కింద పదేళ్ల క్రితం భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసినా, ఇప్పటి వరకు ఆ ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. మరికొందరికి అసలు ప్లాట్లే ఇవ్వలేదు. ఇప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చెరువు భూములను ప్లాట్లుగా మార్చి, రైతులకు ఇచ్చి, వారిని మోసం చేస్తోంది. ఇది రైతులకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం.
పైగా, భవిష్యత్తులో ఇవి చెరువు భూములంటూ ప్రభుత్వమే ఇక్కడి నుంచి రైతుల ఇళ్లను కూలగొట్టి, పంపించేసే అవకాశాలు అధికం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కూడా వెన్నుపోటు పొడుస్తోంది. సందట్లో సడేమియాగా అర్హులు కాని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకూ ప్లాట్లు ఇచ్చుకుంటోంది. రాజధాని ప్రాంతంలో పలువురు రైతులను నిలువునా ముంచేందుకు చంద్రబాబు సర్కారు నేతృత్వంలోని సీఆర్‌డీఏ చెరువుల భూములను కబ్జా చేసింది.
రాజధాని కోసం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద భూములు ఇచ్చిన రైతులకు వాటిలో రెసిడెన్షియల్ ప్లాట్లు (నివాస స్థలాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఆ ముసుగులో టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తుళ్లూరు, పిచ్చుకలపాలెం చెరువు భూములలో రెసిడెన్షియల్ ప్లాట్లను సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే అందుకు ఆధారం. దొండపాడు చెరువును కబ్జా చేసి, చదును చేసి సీడ్ యాక్సిస్ రోడ్డును నిర్మించడం మరో నిదర్శనం.
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలలోని 29,233 మంది రైతులు 34,937.33 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ‘భూ సమీకరణ’ కింద సీఆర్‌డీఏకు ఇచ్చారు. ఈ రైతులకు మెట్ట భూమి ఎకరానికి అభివృద్ధి చేసిన 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇస్తామని, మాగాణి (జరీబు) భూమైతే ఎకరానికి 1000 గజాల నివాస, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆ మేరకు 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లను కేటాయించామని, ఇప్పటివరకూ 27,105 మంది రైతులకు 61,753 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని సీఆర్‌డీఏ చెబుతోంది. ఇంకా 2,128 మంది రైతులకు 7,668 ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని పేర్కొంది.
చెరువును అసైన్డు భూమిగా చిత్రీకరించి..
తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో రీసర్వే అండ్ రీసెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్) ప్రకారం సర్వే నంబరు 87లో 11.25 ఎకరాలు, సర్వే నంబరు 88లో 0.31, 89లో 0.59 ఎకరాలు చెరువు భూమి అని స్పష్టంగా ఉంది. ఆ గ్రామ భౌగోళిక మ్యాప్‌లోనూ సర్వే నంబరు 87లో చెరువు ఉన్నట్లు చూపుతోంది. కానీ, ఆ చెరువు భూమిలో 78 మందికి సీఆర్‌డీఏ రెసిడెన్షియల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేసింది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నంబరు 87లో భూమి అసైన్డు భూమిగా సీఆర్‌డీఏ పేర్కొనడం గమనార్హం.
అంటే... పిచ్చుకలపాలెం చెరువులో 11.25 ఎకరాల భూమిని అసైన్డు భూమిగా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. కొండవీటి వాగు వరదను మళ్లించేందుకు నెక్కల్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వుతున్న గ్రావిటీ కెనాల్‌ను పిచ్చుకలపాలెం చెరువులోనూ కొంత భాగం తవ్వారు. ఆ కెనాల్‌కు అటు ఇటుగా ఈ 78 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. ఇక తుళ్లూరులో సర్వే నెంబరు 80లో 33.06 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది.
‘మీ భూమి’ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ అది చెరువు భూమే అని అడంగల్ రికార్డు స్పష్టం చేస్తోంది. కానీ.. ఆ చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఇక ప్రధాన రాజధాని ప్రాంతం (సీడ్ కేపిటల్)ను కోల్‌కత–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం దొండపాడు చెరువును సీఆర్‌డీఏ కబ్జా చేయడం గమనార్హం. ఆ చెరువును చదును చేసి రోడ్డు నిర్మించింది.
చెరువును పరిరక్షించాల్సింది పోయి..
కొండవీటివాగు, పాలవాగు ముంపు నుంచి రాజధాని అమరావతిని తప్పించడానికి ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు నెదర్లాండ్‌కు చెందిన నిపుణులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముంపు ముప్పు నివారణ పనులను సీఆర్‌డీఏ చేపట్టింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరచుగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది బహిరంగ రహస్యమే.
అసలే ముంపు ముప్పు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి, వాటి స్వరూపాన్ని మార్చేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని.. వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనేక సార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చాయని గుర్తుచేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి చెరువు భూములను రెసిడెన్షియల్ ప్లాట్ల కింద ఇచ్చేయడం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించడం సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని పర్యావరణవేత్తలు, న్యాయనిపుణులు అంటున్నారు.
అనర్హులే అధికం..
రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సీఆర్‌డీఏ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూసమీకరణ కింద తీసుకున్న భూములలోనే ఇవ్వాలి. కానీ.. పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్లూరు చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకూ చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందన్నది స్పష్టమవుతోంది.
ఆ ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకుంటే.. చట్టప్రకారం భవిష్యత్‌లో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. ఇక్కడ టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి కొన్ని ప్లాట్లు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి.
అందుకే చెరువు భూమిని సీఆర్‌డీఏ అసైన్డు భూమిగా చిత్రీకరించిందని మండిపడుతున్నారు. చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం, తుళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు భూమిలో ప్లాట్లు ఎలా ఇస్తారు?
పిచ్చుకలపాలెంలో సర్వే నంబరు 87లో 11.25 ఎకరాల భూమిలో చెరువు ఉంది. ఆర్‌ఎస్‌ఆర్, రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఆ సర్వే నంబరులో చెరువు ఉందన్నది స్పష్టం. సీఆర్‌డీఏ అధికారులు 78 మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. ఇది అక్రమం కాదా? ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో వాటిని కూల్చరని గ్యారంటీ ఇచ్చేదెవరు?
రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి మాకు చెరువు భూమిలో ప్లాట్లు అంటగట్టి మోసం చేస్తారా? పిచ్చుకలపాలెం చెరువు భూమిలో ప్లాట్లు ఇచ్చిన వారిలో రైతులు కాని వారు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బ్రహ్మంచౌదరి, రైతు, పిచ్చుకలపాలెం


