సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్‌కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
‘‘ప్రభాకర్‌రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో..
‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది.
ప్రణీత్‌రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్‌ఫెషన్‌లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది.


