ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఆయా కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాని రాష్ట్రాల్లోనే తమ నిర్ణయాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘కౌన్సిళ్లకు ఎన్నికలు జరగని పక్షంలో ఆయా రాష్ట్రాల్లో మహిళలకు 20 శాతం సీట్లు కేటాయించాలి.
పోటీ చేయడానికి సరిపడా మహిళా అభ్యర్థులు లేనిపక్షంలో మరో10 శాతం సీట్లను వీలైతే పురుషులకు కేటాయించుకోవచ్చు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇప్పటికే ఆరు బార్ కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ మొదలెట్టేశామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్‌పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిళ్లలో ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ అమలుచేయాలని లాయర్లు యోగమయ ఎంజీ, షెహ్లా చౌదరిలు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఆఫీస్ బేరర్ పోస్టుల్లో కనీసం ఒక్కటైనా మహిళలకు కేటాయించాలని వాళ్లు ధర్మాసనాన్ని గతంలో కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఒక ఆఫీస్‌బేరర్ పోస్ట్ రిజర్వ్‌చేస్తూ గత ఏడాది మే రెండో తేదీన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే.


