ధరల పెంపు వివరాలు 90 రోజుల ముందే బహిరంగపరచాలన్న తీర్పు నిలుపుదల
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్‌రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.


