న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)కనెక్షన్ ఉన్న ఇళ్లలో డొమెస్టిక్ ఎల్పీజీ (ఎల్‌పీజీ)సిలిండర్లను ఉంచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన సరఫరాలో తలెత్తుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా, జాతీయ ఇంధన నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.
సవరించిన కొత్త నిబంధనలివే
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లను రీఫిల్ చేయడంపై కూడా నిషేధం విధించారు. పీఎన్జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సంబంధిత కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది.
ఎందుకీ కఠిన నిర్ణయం?
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద తలెత్తిన అడ్డంకులు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై నిఘా
మరోవైపు పెట్రోల్ లేదా డీజిల్‌ను బాటిళ్లు, డబ్బాలు వంటి అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన భద్రతా ముప్పులు పొంచి ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విడి డబ్బాల్లో పెట్రోల్ పోసిన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆందోళన వద్దు.. నిల్వలు పుష్కలం!
దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. గృహ అవసరాలకు, రవాణా రంగానికి 100 శాతం గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తూ ‘నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్’ జారీ చేశారు. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం దేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా?


