న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద వాంగ్‌చుక్‌ను నిర్బంధించడం అక్రమం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఏకపక్షంగా తీసుకున్న చర్యగా గీతాంజలి పేర్కొన్నారు.
నవంబర్ 24వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలంటూ కేంద్రం, లద్దాఖ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో సుప్రీం ఓకే చెప్పింది. దీనిపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. లద్దాఖ్‌ను రాజ్యాంగం ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లతో సెప్టెంబర్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. పలు ఘటనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయప డ్డారు. హింసను ప్రేరేపించారనే ఆరోప ణలపై వాంగ్‌చుక్‌ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు.


