క్షమించండి, తీర్పు అనంగీకారం! | Sakshi Guest Column On State of Tamil Nadu vs Governor Issue | Sakshi
Sakshi News home page

క్షమించండి, తీర్పు అనంగీకారం!

Dec 11 2025 12:26 AM | Updated on Dec 11 2025 12:26 AM

Sakshi Guest Column On State of Tamil Nadu vs Governor Issue

విశ్లేషణ

‘తమిళనాడు రాష్ట్రం వర్సెస్‌ తమిళనాడు గవర్నర్‌’ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యం: తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించ లేదు. వాటిని ఆయన రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు సమ్మతి తెలుపలేదు. మరోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ శాసనసభకు తిప్పి పంపనూ లేదు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం–గవర్నర్‌ మధ్య వివాదానికి దారితీసింది.

ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: 1. ఆమోదం పొందని బిల్లుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు చెప్పగలదా? శాసనసభ ఆమోదించి పంపినా గవర్నర్‌ లేదా రాష్ట్రపతి దానికి సమ్మతి ఇవ్వనప్పుడు అది చట్టం హోదా పొందినట్లేనని భావించ వచ్చా? 2. ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ గవర్నర్‌ లేదా రాష్ట్రపతిని, ఆర్టికల్‌ 142 కింద, సంపూర్ణ న్యాయం అనే సూత్రం ప్రాతిపదికగా సుప్రీం కోర్టు బలవంత పెట్టగలదా? 3. శాసన  సభ–గవర్నర్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకు దఖలు పరిచిందా?
రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఆర్టికల్‌ 200 ప్రకారం, గవర్నర్‌ బిల్లును అందుకున్న తరువాత సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదముద్ర వేయాలి లేదా తన వ్యాఖ్యలు జోడించి వెనక్కు పంపాలి లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఒకసారి తిప్పిపంపిన తర్వాత, శాసనసభ ఆ బిల్లును మళ్లీ పంపితే, దానికి ఆమోదముద్ర వేయడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం లేదు. తమిళనాడు విషయంలో బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయలేదు, వెనక్కు పంపలేదు. శాసనసభ తనకుతానుగా అదే బిల్లును రెండోసారి ఆమోదించి గవర్నర్‌కు పంపింది. 

గవర్నర్‌ ఎంతకాలం బిల్లును పెండింగులో పెట్టగలరు? రాజ్యాంగం కాలపరిమితి విధించడం లేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ తిప్పి పంపాలని మాత్రమే చెబుతోంది. ఒకవేళ బిల్లు ఆమో దించడానికి నిరాకరిస్తే? అలాంటప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్‌ లేదా రాష్ట్రపతి మీద చట్టసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. రెండు, ఆ బిల్లును మరోసారి పరిశీలించి ఆమోదించి పంపడం. తమిళనాడు శాసనసభ ఈ రెండో మార్గం ఎంచుకుంది. అది ప్రారంభించిన ఈ రాజ్యాంగ సంప్రదాయానికి రాజ్యాంగబద్ధత ఉందా? సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చర్చించలేదు.  

మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. గవర్నర్‌ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించినప్పుడు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయకుండా నిలిపివేస్తే, రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి ఎలాంటి సందేశం రాకపోతే, శాసనసభ స్వయంగా బిల్లును పున:పరిశీలించి రెండోసారి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. బిల్లు రెండోసారి సభ ఆమోదం పొందినప్పుడు, ఆమోద ముద్ర వేయడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. ఆర్టికల్‌ 143 కింద, రాష్ట్రపతి సుప్రీం కోర్టును అడిగిన ప్రశ్న: రాష్ట్రపతి ఎంతకాలం బిల్లును నిలిపివేయవచ్చు? దీనికి సమాధానంగా ఒక సంప్రదా యాన్ని నెలకొల్పే అవకాశం ఇదే ఆర్టికల్‌ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శక న్యాయస్థానంగా వ్యవహరించకుండా, దేశానికి సూపర్‌ హీరోగా, బాస్‌గా వ్యవహరించింది.

ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుత కేసులో రాష్ట్రపతి బిల్లును తిప్పి పంపలేదు, ఆమోద ముద్రా వేయలేదు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా, లేదా సందేశంతో వెనక్కు పంపకపోయినా, శాసనసభకు ఉన్న ప్రత్యామ్నాయం ఆ బిల్లును తిరిగి పరిశీలించడం. అలా రాష్ట్రపతి సలహా లేకుండా బిల్లును పున:పరిశీలించి ఆమోదిస్తే, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం తప్ప మరోలా చేయలేరు. భవిష్య త్తులో శాసనసభకు రాష్ట్రపతికి మధ్య విభేదాలు వస్తాయని రాజ్యాంగం ఊహించలేదు.

కానీ సుప్రీం కోర్టు తీర్పు వ్యవస్థల అధికార పరిధి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ప్రధాన సమస్య. ఆర్టికల్‌ 145 ప్రకారం, సుప్రీం కోర్టుకు తన కార్యకలాపాలకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం ఉంది. అలాగే, ఆర్టికల్స్‌ 118, 208 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తమ సభావ్యవహారాల నిర్వహణకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి. ఆర్టికల్స్‌ 122, 212 ప్రకారం సభా కార్యకలాపాలను కోర్టులో ప్రశ్నించే వీల్లేదు. 

రాష్ట్రం, కేంద్రం నడుమ వివాదమా?
భారత రాజ్యాంగం శాసనసభ, గవర్నర్‌ మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆచరణలో అనేక సందిగ్ధతలు ఉత్పన్నమవుతున్నాయి. బిల్లులు స్పీకర్‌ ద్వారా మాత్రమే గవర్నర్‌కు చేరతాయి. గవర్నర్‌ సమ్మతి పొందే వరకు బిల్లు శాసనసభ ఆస్తిగా ఉంటుంది. ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదముద్ర పొందనంత వరకు ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు.

ఆర్టికల్‌ 212 ప్రకారం శాసనసభ ప్రక్రియలు న్యాయస్థాన అధికార పరిధిలోకి రావు. అదే సమయంలో, ఆర్టికల్స్‌ 32, 131 ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా రాష్ట్రం–కేంద్రం నడుమ వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. గవర్నర్‌ లేదా రాష్టపతి బిల్లుపై సంతకం చేయకపోవడం రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం అవుతుందా? అలా అయ్యేట్లయితే అది సుప్రీం పరిధిలోకి వస్తుంది. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్ని పరిశీలించలేదు. 

ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, శాసనసభ బిల్లును రెండోసారి ఆమో దించడం. దీనివల్ల గవర్నర్‌ ఆమోదం ఇవ్వకుండా తప్పించు కోలేరు. రెండవది, ఆర్టికల్‌ 156(1) ప్రకారం, రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్‌ పదవిలో ఉంటారు. అసెంబ్లీ తీర్మానం చేసి, గవర్నర్‌ను వెనక్కి పిలిపించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమైంది.

గవర్నర్‌ ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసినప్పుడు, ఆయన తన అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్లే. అందువల్ల రాష్ట్రపతి, గవర్నర్‌ ఒకే గుర్తింపు కలిగిన వారవుతారు. ఈ ముఖ్యాంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలించలేదు. ఆర్టికల్‌ 12 ప్రకారం ‘స్టేట్‌’ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ; కేంద్రంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు అవుతాయి. 

కాబట్టి, రాష్టం గవర్నర్‌పై పిటిషన్‌ వేయడం అంటే తన మీద తనే కేసు వేసుకున్నట్లు అవుతుంది. ఇదెలా సాధ్యం? రాష్ట్రంలోని ఒక విభాగం మరొక విభాగానికి వ్యతి రేకంగా రిట్‌ పిటిషన్‌ను ఎలా దాఖలు చేయగలదో తేల్చడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలమైంది. ఈ కారణాల వల్లనే నేను ఆ తీర్పుతో ఏకీభవించడం లేదు.

ప్రకాశ్‌ అంబేడ్కర్‌
వ్యాసకర్త లోక్‌సభ, రాజ్యసభ మాజీ సభ్యులు, అడ్వకేట్‌ 
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement