అసలు పోరు దీదీతో! | In the Assembly elections BJPs real battle is with Mamata Banerjee | Sakshi
Sakshi News home page

అసలు పోరు దీదీతో!

Mar 20 2026 12:01 AM | Updated on Mar 20 2026 12:01 AM

In the Assembly elections BJPs real battle is with Mamata Banerjee

అసెంబ్లీ ఎన్నికలు త్వరలో అయిదు రాష్ట్రాలకు జరగనున్నాయి గానీ, దేశందృష్టి ప్రధానంగా ఉండేది ‘దీదీ’ పైనే. బీజేపీ అసలు యుద్ధం కూడా మమతా బెనర్జీతోనే. ఇప్పటికే వరుసగా మూడు సార్లు పశ్చిమ బెంగాల్‌ సీఎం అయిన ఆమె నాల్గవసారి కూడా విజయం సాధి స్తారా, లేక బీజేపీ ఈసారి అధికార లక్ష్యాన్ని చేరగలదా అన్నది ముఖ్యమే అయినా, అది మాత్రమే కాదు ప్రశ్న. సీట్లు అధికారానికి సంబంధించిన విషయం కాగా, ఇందులో దీర్ఘకాలిక సైద్ధాంతిక అంశాలు కూడా ఉన్నాయి.

ఐదు ప్రచారాంశాలు
తన 55 సంవత్సరాల రాజకీయ జీవితం పొడవునా ‘ఫైర్‌బ్రాండ్‌’గానే నిలిచిన మమత, ఒక విలక్షణమైన నాయకురాలు. 70 సంవత్సరాల వయసు దాటిన స్థితిలోనూ తనలోని అగ్ని మందగించక పోవటం అసాధారణ విషయం. 1998లో తృణమూల్‌కాంగ్రెస్‌ (టీఎంసీ) స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్‌తో పాటు వామ పక్ష కూటమిని, బీజేపీని కూడా ఒంటి చేత ఢీకొని వరుసగా గెలుస్తూ వస్తు న్నారు. 

ఆమె వరుసగా మూడవసారి రాష్ట్రంలో విజయ పతాకను ఎగరవేసినట్లే, వరుసగా మూడవసారి కేంద్రంలో గెలిచిన బీజేపీ, ఈసారి ఏ విధంగానైనా పశ్చిమ బెంగాల్‌ను వశపరచుకుని తీరా లన్న పట్టుదలతో ఉంది. అక్కడి మొత్తం స్థానాలు 294లో పోయిన మారు తృణమూల్‌ గెలిచిన 213కు, బీజేపీ తెచ్చుకోగలిగిన 77కు మధ్యగల తేడా 136 చాలా పెద్దదే అయినా, దానిని అధిగమించేదుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం, అధికారపక్షమైన బీజేపీ, వారి మాతృ సంస్థ అయిన సంఘ్‌ పరివార్‌ భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడినపుడు ఏమి జరగవచ్చు నన్నది అట్లుంచితే, రాగల ఆరు వారాల ప్రచారం స్థూలంగా అయిదు అంశాల చుట్టూ తిరగగలదని భావించవచ్చు. ఒకటి– మమత, మోదీ నాయకత్వాల స్పర్థ. రెండు– హిందూ జాతీయ వాదం, బెంగాలీ జాతీయవాదం. మూడు–ఫెడరలిజం, యూనిట రిజం. నాలుగు–తృణమూల్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదం. అయిదు– సెక్యులరిజం, మతతత్వం. 

బెంగాలీ జాతీయవాదం
స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి బెంగాలీ జాతీయవాదంఎంత బలంగా రూపు దిద్దుకున్నదో తెలిసిందే. విశేషమేమంటే, 34 సంవత్సరాలపాటు పాలించిన వామపక్ష కూటమి సైతం మార్క్సిజ మని ఎంత మాట్లాడిందో బెంగాల్‌ జాతీయవాదాన్ని అంత పాటించింది. ఆ సుదీర్ఘ సంప్రదాయానికి మమత వారసురాలిగా మారారు. అందుకే గత ఎన్నికలలో బీజేపీ శ్రీరాముడిని, హిందూత్వాన్నిముందుకు తేగా, మమతా బెనర్జీ తమ దేవతలు కాళిక, కృష్ణుడుబెంగాలీ సంస్కృతి అంటూ వారి చిత్రాలతో ర్యాలీలు జరిపారు. 

శ్రీరాముడు 19వ శతాబ్దంలో మాత్రమే బయటి వ్యాపారులతోబెంగాల్‌కు ‘దిగుమతి’ అయ్యాడని ప్రకటించారు. అభివృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అక్కర లేదంటూ, తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, రాష్ట్రంపట్ల మోదీ ప్రభుత్వ వివక్షను ప్రజల దృష్టికి తీసు కువెళ్లారు. ఫెడరలిజం, సెక్యులరిజం తమ నినాదాలని స్పష్టం చేశారు. ఫలితాలు కనిపించినవే. వామపక్ష కూటమి, కాంగ్రెస్‌ తీవ్రంగా దెబ్బతినటంతో పాటు వారి నాయకులు, ఓటర్లు బీజేపీ వైపు మళ్ల టంతో 2019, 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ తగినన్ని సీట్లు (మొత్తం 42లో 18; 12) గెలవగలిగింది గానీ, అసెంబ్లీ సీట్లు 294లో తృణమూల్‌ బలం 210 కన్న తగ్గలేదు. 

వామపక్షాలు, కాంగ్రెస్‌ ఉమ్మడి బలం 2016 నాటి 120 నుంచి 2021లో దారుణంగా పత నమై వారి ఓటర్లు మళ్లటం వల్ల బీజేపీ సీట్లు 3 నుంచి 77కు పెరి గాయి. గత ఎన్నికలలో మమత పట్ల ఆగ్రహంతో బీజేపీ వైపు మొగ్గిన లెఫ్ట్, కాంగ్రెస్‌ శ్రేణులు ఈసారి తీసుకోగల వైఖరి ఏమి టన్నది గమనించదగినదవుతున్నది. బీజేపీని బాహాటంగా ఢీకొంటున్న నాయకురాలిగా ప్రశంసలు పొందుతున్న మమతా బెనర్జీ, ‘సర్‌’ పేరిట సాగిన ఓటర్‌ జాబితాల సవరణను ఏ మేరకు ఎదు ర్కొనగలరన్నది ఈసారి కొత్త పరీక్ష అవుతున్నది.

తమిళనాడు రాజకీయాలు
బెంగాల్‌లో వలె తమిళనాడులోనూ అధికార స్పర్థకు సైద్ధాంతిక అంశాలు తోడవుతున్నాయి. నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ ఎంత ప్రభావం చూపవచ్చుననే అంచనాలను తప్పిస్తే, యథాతథంగా తమిళనాట పాలిస్తున్న డీఎంకే కూటమి బలమైనది. అక్కడి 234 స్థానాలలో ఆ కూటమి పోయినమారు 159 గెలిచింది. 75 తెచ్చుకున్న అన్నాడీఎంకే కూటమి చీలింది. ఒక వర్గం మాజీ ముఖ్య మంత్రి పన్నీర్‌ సెల్వం నాయకత్వాన డీఎంకేలో విలీనమైంది. అన్నాడీఎంకే కూటమిలోకి కొత్తగా ఎవరూ రాలేదు. 

ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వ మేదీ ఆవిర్భవించలేదు. స్టాలిన్‌ ప్రభుత్వ పాలన పట్ల చెప్పుకోదగిన అసంతృప్తి కనిపించటం లేదు. బెంగాల్‌లో వలెనే తమిళనాడులో కూడా తమిళ జాతీయవాదం, లేదా ద్రవిడ వాదం, ఫెడరల్‌ హక్కుల నినాదం దశాబ్దాలుగా కలగలిసిపోయి ఉన్నాయి. అందుకు ఉత్తరాది వ్యతిరేకత నుంచి ఒక పాయగా పుట్టుకు వచ్చిన సెక్యులరిజం తోడైంది. 

తమిళ సమాజాన్ని హిందూత్వ స్రవంతిలోకి తెచ్చేందుకు సంఘ్‌ పరివార్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. అన్నాడీఎంకేను వెంట చేర్చుకునేందుకు లోగడ విఫల ప్రయత్నాలు చేసిన మీదట, రజనీకాంత్‌పై ఆశలు పెట్టుకోగా ఆయన రాజకీయా లలోకి రాకపోగా, ఇపుడు విజయ్‌ వైపు చూస్తున్నారు. ఇంతవరకైతే ఆయన ససేమిరా అంటున్నారు. అనూహ్యంగా విజయ్‌ గెలిచినట్ల యితే తప్ప మరోసారి డీఎంకేదే అధికారం కావచ్చు. 

కేరళ పరిస్థితి కూడా ఇటువంటిదే. 140 సీట్లు గల ఆ రాష్ట్రంలో మళ్లీ లెఫ్ట్‌ ఫ్రంట్, లేదా కాంగ్రెస్‌ నాయకత్వాన గల యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ మినహా, కనీసం ఒక్క స్థానమైనా లేని బీజేపీకి అధికారమన్నది వారు సైతం ఆలోచించటం లేదు. పోయినమారు అనూహ్యంగా త్రిస్సూర్‌లో లోక్‌సభ గెలిచినందున ఆ పరిధిలోని అసెంబ్లీలు ఏవైనా గెలవగలరేమో చూడాలి. పుదుచ్చేరి విషయం అట్లుంచితే, అస్సాంలో గత పదేండ్ల నుంచి ప్రభుత్వంలో గల బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవటం పరీక్ష అవుతుంది. 

పోయిన మారు 126 స్థానాలలో 60 మాత్రమే తెచ్చుకుని, తర్వాత పరిపా లనా వైఫల్యాలతో కొంత అప్రతిష్ఠ పాలైనా, హిందూత్వ వాదం బలంగా ఉండటంపై వారు ఆశలు పెట్టుకుని ఉన్నారు. హిందూత్వ వాదం, కేంద్రీకృత అధికారం ఒకవైపు; ప్రాంతీయ జాతీయ వాదాలు, ఫెడరలిస్టు భావనలు మరొకవైపు అన్నట్లుగాఉంది. ఈ రెండు శక్తుల సైద్ధాంతిక పోరాటాలకు బెంగాల్, తమిళనాడు కేంద్రం కానున్నాయి. ఆ ఫలితాల ప్రభావం అనేక విధాలుగా ఉండగలదు.

-వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు
-టంకశాల అశోక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement