చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన‍్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున‍్నారని చెప్పారు.
తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.


