హక్కుల హరణం అన్యాయం | Transgender Rights Protection Act was finally passed in 2019 | Sakshi
Sakshi News home page

హక్కుల హరణం అన్యాయం

Mar 20 2026 12:10 AM | Updated on Mar 20 2026 12:10 AM

Transgender Rights Protection Act was finally passed in 2019

సమస్య ఉందని గుర్తించటం, దానికి పరిష్కారం అన్వేషించటం ఒక ఎత్తయితే అందుకు సంబంధించి చట్టం తీసుకురావటం మరో పెద్ద పని. మన దేశంలో చాలా సందర్భాల్లో అందుకు దశాబ్దాలు పడుతుంది. తీరా ఆ చట్టాన్ని కాస్తా నీరుగారిస్తే...? ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ), చట్టం 2019కి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణలు వారికి దక్కిన అరకొర హక్కుల్ని కాస్తా హరించేలా ఉన్నాయి. సృష్టి ఒక గీత గీసిందనీ, ఎవరైనా దానికి అటో, ఇటో ఉండాలి తప్ప వేరేవిధంగా ఉండటానికి వీల్లేదన్నది కాలం చెల్లిన భావన. 

మన దేశంలో తొలిసారి 2014లో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల్ని గుర్తించి,వారికి కూడా ఇతరుల్లాగే ప్రాథమిక హక్కులుంటాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయాలే విలువలుగా చలామణిలోకొస్తాయి. ఆడ, మగ కలిసి ఉండటం సహజమనీ, ఇతరమైన సంబంధాలు అసహజమనీ భావించే ధోరణి అటువంటిదే.

ప్రభుత్వాలు సైతం ఆ దోవనే పోవటంతో దశాబ్దాలుగా ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌) వర్గాల వారు అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కోవడం సాధారణ విషయాలుగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అయిదేళ్లకు 2019లో ఎట్టకేలకు ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. ఆ చట్టం కింద జిల్లా కలెక్టర్‌కు ట్రాన్స్‌జెండర్‌నని దరఖాస్తు చేసుకున్నవారికి ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేది. 

కొత్త సవరణ అలా కుదరదంటోంది. ప్రధాన వైద్యాధికారి లేదా ఉప వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్‌ బోర్డులు ఏర్పడాలనీ, వాటి సిఫార్సుల ఆధారంగానే కలెక్టర్లు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలనీ తాజా సవరణ చెబుతోంది. దీంతోపాటు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై జరిగే హింస, భిక్షాటన చేయించటం నేరాలుగా పరిగణిస్తూ, కఠిన శిక్షలు నిర్దేశిస్తూ నిబంధనలు పొందుపరిచారు. 

అసలు జిల్లా కలెక్టర్‌ స్థాయిలో ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవటమే పెద్ద సమస్యగా పరిణమిస్తున్నదనీ, ఈ క్రమంలో వేధింపులు ఎదురవుతున్నాయినీ ఆ వర్గాలవారు ఆవేదన పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ధ్రువీకరణ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా 2023 డిసెంబర్‌ నాటికి దరఖాస్తుల్లో 65 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈలోగా దాన్ని మరింత జటిలం చేసే సవరణలు వచ్చిపడ్డాయి. 

చట్టం రూపొందించేటపుడూ లేదా దానికి సవరణలు తీసుకురాదల్చుకున్నప్పుడూ సంబంధిత వర్గాలతో చర్చించటం, అవసరమైన మార్పులు చేర్పులకు సిద్ధపడటం ఒక ప్రజాస్వామిక సంప్రదాయం. సాగు చట్టాలు మొదలుకొని చాలా విషయాల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దాన్ని పక్కనబెడుతోంది. పుట్టుకతో అందరూ గుర్తించిన జెండర్‌కు భిన్నమైన లైంగిక భావనలుండటం ప్రకృతి విరుద్ధం కాదని చెబుతూ స్వలింగసంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ 277 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. 

ఆ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ‘స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం’ అని వ్యాఖ్యానించారు. ఆ వర్గాలవారు అసలే దారుణ వివక్ష ఎదుర్కొంటున్నారు. జాతీయ మానవ హక్కుల నివేదిక, 2018 ప్రకారం వారిలో 92 శాతం మంది ఆర్థిక వెలికి గురవుతున్నారు. అక్షరాస్యత కూడా 56.1 శాతం. జాతీయ సగటు 74 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. నిరుద్యోగం 48 శాతం. బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా అడ్డంకులు. ఇక ఆర్థిక సాయం పొందటం గురించి చెప్పేదేముంది?

స్వలింగ సంపర్కం నేరం కాదని మొదటిసారి గుర్తించింది 1791 నాటి ఫ్రెంచ్‌ విప్లవం సమయంలో. లెనిన్‌ ఆధ్వర్యంలోని సోవియెట్‌ ప్రభుత్వం 1920లో స్వలింగసంపర్కుల హక్కుల్ని గుర్తించి చట్టం తీసుకొచ్చింది. ఆ మాత్రం మార్పు రావటానికి ప్రపంచ దేశాల్లో ఎంతకాలం పట్టిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దాన్ని మహాపాపంగా, నేరంగా పరిగణించే దేశాలు ఎన్నో! ఈ బిల్లుపై పార్లమెంటు చర్చించేలోగా ట్రాన్స్‌జెండర్‌ వర్గాలను సంప్రదించాలి. చట్టాన్ని మరింత సరళం చేయటం అవసరమని భావిస్తున్న తరుణంలో వారికి వ్యవస్థ ఆమోద ముద్రను తప్పనిసరి చేయటం ధర్మం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement