బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయదుందుభి | YSRCP candidates victory in Bar Council elections | Sakshi
Sakshi News home page

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయదుందుభి

Mar 19 2026 4:53 AM | Updated on Mar 19 2026 4:53 AM

YSRCP candidates victory in Bar Council elections

వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నిక

టీడీపీ, కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి నలుగురు చొప్పున ఎన్నిక 

జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, ఐదుగురు తటస్థుల విజయం 

23 మంది ఎన్నికైనట్టు ప్రకటించిన సుప్రీంకోర్టు హైపవర్‌ కమిటీ 

త్వరలో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరి­గిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ (న్యాయ­వాద మండలి) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన న్యాయవాదులు విజయదుందుభి మోగించారు. మొత్తం 23 మంది సభ్యుల్లో ఏడుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నలుగురు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన మరో నలుగురు గెలిచారు. జనసేనకు చెందిన ఇద్దరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఐదుగురు తటస్థులు బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. బుధవా­రం ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో 23 మంది అభ్యర్థులు ఎన్నికైనట్టు సుప్రీంకోర్టు హై­పవర్‌ కమిటీ ప్రకటించింది. 

బార్‌ కౌన్సిల్‌ సభ్యు­లుగా ఎన్నికైన వారిలో అజయ్‌కుమార్‌ చలసాని, చిదంబరం కలిగినీడి, రామిరెడ్డి ఆలూరు, శాంతకుమార్‌ గొర్రెముచ్చు, బ్రహ్మారెడ్డి వట్టిజొన్నల, బాలాజీ యలమంజుల, కృష్ణారెడ్డి బీవీ, శ్రీని­వాసరాజు ఉప్పలపాటి, రాజేంద్రప్రసాద్‌ సుంకర, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని, సుమంత్‌ ఎన్‌వీ, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి బండారు, రామా­రావు ఘంటా, రామ జోగేశ్వరరావు కీర్తి, వెంకట్రామిరెడ్డి కొవ్వూరి, మాధవి రోళ్ల, కృష్ణమోహన్‌.­ఎస్, అంకయ్య సత్తు, శ్రీదేవి జంపాని, మంజులత దోని, దుర్గనాగశ్రీ, గంగాభవాని రాగి ఉన్నారు. 

రిజర్వేషన్‌తో మహిళలకు సముచిత స్థానం 
ఎన్నికైన 23 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడంతో ఇంత మంది ఎన్నిక కాగలిగారు. మరో ఇద్దరు మహిళలను కో–ఆప్షన్‌ కింద హైప­వర్‌ కమిటీ ఎంపిక చేయనుంది. ఎన్నికైన వారిలో రామారావు ఘంటా గతంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా చేశారు. రామిరెడ్డి ఆలూరు ప్రస్తుతం బీసీఐ సభ్యుడిగా కొన­సాగుతున్నారు. రామజోగేశ్వరరావు గతంలో వైస్‌ చైర్మన్‌గా పనిచేయగా, కృష్ణమోహన్‌ ప్రస్తుతం వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుత చైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి కుమా­రుడు సుమంత్‌ ఎన్‌వీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. శాంతకుమార్, బాలాజీ, శ్రీనివాసరాజు, శ్రీనివాసులరెడ్డి, సుమ­ంత్, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి, అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గనాగశ్రీ, గంగాభవాని తొలిసారిగా బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యా­రు. 

బార్‌ కౌన్సిల్‌లో మొత్తం 26 మంది సభ్యులు­గా ఉంటారు. ఇందులో 25 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎక్స్‌ అఫీ­షియో సభ్యుడిగా ఉంటారు. ఈ 25 మందిలో ఇప్పుడు 23 మందిని ఎన్నికైనట్టు ప్రకటించారు. మరో ఇద్దరిని కో –ఆపె్టడ్‌ సభ్యులుగా హైపవర్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రేసులో అజయ్‌కుమార్, చిదంబరం, బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

రేయింబవళ్లు ఓట్ల లెక్కింపు 
ఎన్నికలు గత నెల 13న జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 149 కేంద్రాల్లో పోలింగ్‌ జరగ్గా.. గత నెల 16 నుంచి ఈ నెల 18 వరకు నిరాటంకంగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎలాంటి గందరగోళం, అవా­ంతరాలు లేకుండా ఓట్ల లెక్కింపును పూర్తి చేసినందుకు బార్‌ కౌన్సిల్‌ అధికారులను న్యాయవాద వర్గాలు అభినందించాయి. ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. 

సుప్రీంకోర్టు హైపవర్‌ కమిటీ నిర్దేశించిన గడువు దగ్గర పడటంతో బార్‌ కౌన్సిల్‌ అధికారులు, ఉద్యోగులు చివరి మూడు రోజులు రోజుకు రెండు మూడు గంటల విరామం మాత్రమే తీసుకుని రేయింబవళ్లు ఓట్లు లెక్కించారు. చివరి రోజున ఓట్ల లెక్కింపు చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. అంకయ్య సత్తు, మరో సభ్యుడు వేనాటి చంద్రశేఖరరెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరకు అంకయ్య 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరిద్దరూ నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కావడం విశేషం.

రూ.కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు 
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి రిటర్నింగ్‌ అధికారిగా, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా సీనియర్‌ న్యాయ­వాది వి.వేణుగోపాలరావు, న్యాయ­వాది పీఎస్‌పీ సురేష్‌ కుమార్, పరిశీలకులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ వ్యవహరించారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు భారీ స్థాయిలో ఖర్చు చేశారు. 

కొందరు అభ్యర్థుల ఖర్చు రూ.5 కోట్లు దాటింది. ఫలానా రాజకీయ పార్టీ తర­ఫున పోటీ చేస్తున్నామని అభ్యర్థులు ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో బార్‌ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహించిన పలువురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement