ఆత్మనిర్భరతకు సామ్రాజ్యవాద సవాల్‌ | Sakshi Guest Column On India USA Issues | Sakshi
Sakshi News home page

ఆత్మనిర్భరతకు సామ్రాజ్యవాద సవాల్‌

Mar 18 2026 12:25 AM | Updated on Mar 18 2026 12:25 AM

Sakshi Guest Column On India USA Issues

ట్రంప్‌ ఆర్థిక–భౌగోళిక రాజకీయ విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుస్తోంది కనుక, ఆయన పదవీ కాలంలో అమెరికాతో ఇక ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మనం సుముఖత చూపకపోవడం మంచిది.

అభిప్రాయం

నాలుగు కీలకమైన అంశాల్లో విదేశాలపై ఆధారపడటం ద్వారా స్వతంత్ర భారతదేశం తన అభివృద్ధి ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. అవి ఆహారం, విదేశీ మారకద్రవ్యం, రక్షణ సామగ్రి, ఇంధనం. దేశం 1957–58లో ఎదుర్కొన్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభం బయట నుంచి ఎదురు కాగల ద్రవ్యపరమైన అవరోధాలను వెల్లడించింది. చైనాతో 1962లో రేగిన యుద్ధం రక్షణ సామగ్రి కొరతను బహిర్గతం చేసింది. 1965–67లో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులు ఆహార దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలిపాయి. గల్ఫ్‌ యుద్ధం (1990) చమురు ధరలు ఒక్కసారిగా పెరగడానికి దారితీసి, విదేశీ మారక ద్రవ్య చెల్లింపులలో సంక్షోభానికి పురికొల్పింది. అప్పటి ప్రభుత్వాలు ఆ యా సంక్షోభాల నుంచి ఆర్థిక, విదేశాంగ విధాన పాఠాలను నేర్చుకున్నాయి. 

విదేశాంగ విధానంపై ఒత్తిడి
చైనాతో యుద్ధ (1962) కాలంలో రక్షణ పరికరాల లోటుతో అప్పటి ప్రధాని నెహ్రూ గత్యంతరం లేక అమెరికా సాయాన్ని కోరవలసి వచ్చింది.  అమెరికా–వియత్నాం యుద్ధంలో భారత్‌ వైఖరిని మార్పు చేసేందుకు ఆహార ఎగుమతులను పావుగా వాడుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ ప్రయత్నించారు. చమురు ధరలు 1990లో అమాంతం పెరిగాయి. తదనంతరం, 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిన సంక్షోభంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దగ్గర భారత్‌ చేయి సాచాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా గుర్తించడం దాని పర్యవసాన ఫలితమే. 

ఈమధ్య కాలంలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, జి–7 (కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా) దేశాలు బ్యాంక్‌ ఖాతాలను స్థంభింపజేయడం వంటి చర్యలతో ఆర్థిక లావాదేవీలను ఒక ఆయుధంగా మలచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇంధన సరఫరాలను ఒక ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఇవి విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు అడ్డుపడుతున్నాయి. స్వావలంబనను సాధించడం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో తెలియజెబుతున్నాయి. 

నమ్మక ద్రోహం
అన్ని రకాల వాణిజ్యాలను ముఖ్యంగా ఇంధనం, రక్షణ సామగ్రిని, అధునాతన, కీలక టెక్నాలజీలను ఆయుధంగా వాడుకునే ప్రస్తుత విధానాన్ని అమెరికా ఇకముందు కూడా కొనసాగిస్తుందని మన జాతీయ భద్రతా నిర్వాహకులు గుర్తెరగవలసి ఉంది. గత ఫిబ్రవరిలో అమెరికా–భారత్‌ చేసిన సంయుక్త ప్రకటన కొంత ఆశలను రేకెత్తించింది కానీ, కడచిన పన్నెండు నెలల పరిణామాలు, అటువంటి భ్రమలేవీ పెట్టుకోకపోవడం మంచిదని సూచిస్తున్నాయి. సైనిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పెంపొందించపజేసుకోవాలని, 21వ శతాబ్దానికి అవసరమైన వాణిజ్యం, టెక్నాలజీలను వేగవంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న భారత్‌–అమెరికా దానికి సంక్షిప్తంగా ఇంగ్లీషులో ‘కాంపాక్ట్‌’ అనే సంకేత నామాన్ని కూడా పెట్టుకున్నాయి. 

‘ట్రస్ట్‌’గా మరో సంక్షిప్త నామంతో పిలుచుకుంటున్న ఒప్పందం పైన కూడా మోదీ, ట్రంప్‌ సంతకాలు చేశారు. వ్యూహాత్మక టెక్నాలజీని వినియోగించుకుంటూ అమెరికా–భారత్‌ తమ సంబంధాలను రూపాంతరం చెందించుకుంటున్నాయని ఆ మాటకు అర్థం. ‘ఇంధనం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేటట్లు చూసేందుకు, ఇంధన మార్కెట్లలో ధరల స్థిరీకరణకు’ వాగ్దానం చేసిన ప్రకటన పైన కూడా ట్రంప్‌ సంతకం చేశారు. ఆ వాగ్దానానికి విరుద్ధంగా నడచుకోవడం ద్వారా ట్రంప్, గత 25 ఏళ్ళుగా భారత్‌–అమెరికా మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు సాగుతున్న కృషికి తిలోదకాలిచ్చారు. గత పదిహేను రోజుల పరిణామాలు చూశాక, ఇంధన భద్రత విషయంలో ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికాను ఇక ఎంతమాత్రం నమ్మడానికి లేదని భారత్‌ గ్రహిస్తోంది. 

పశ్చిమాసియా ఘర్షణలు భారత్‌ ఇంధన భద్రతకే కాక, ఈ ప్రాంతంలో భారత్‌ సమీకరించుకోగల ఆర్థిక ప్రయోజనాలకు కూడా చేటు తెస్తాయి. గల్ఫ్‌లో భారత్‌ సముపార్జించుకున్న భౌగోళిక–ఆర్థిక ప్రాబల్యానికి అమెరికా–ఇజ్రాయెల్‌ చర్య ఎసరు పెట్టింది. ఆ రెండు దేశాలు ఒక రకంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాయి. అవి చేసిన తప్పిదాన్ని ప్రధాని ధైర్యంగా పార్లమెంట్‌లో ప్రకటించగలగాలి. 

ట్రంప్‌ ఆర్థిక–భౌగోళిక రాజకీయ విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుస్తోంది. కనుక, ట్రంప్‌ పదవీ కాలంలో, అమెరికాతో ఇక ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మనం సుముఖత చూపకపోవడం మంచిది.  మోదీ ప్రభుత్వ ‘ఆత్మనిర్భరత’ విధానం, అమెరికా అనుసరిస్తున్న ‘నయా–సామ్రాజ్యవాద’ విధాన సవాల్‌కు ఎదురొడ్డి తీరాలి. స్వావలంబన మనకు మనం సాధించుకునేది. అది ఎవరో మంజూరు చేస్తే వచ్చేది కాదు. 

మూడు దేశాలతో జాగ్రత్త!
ఈ బాహ్యపరమైన ఒత్తిడులు కొత్తగా వచ్చిపడుతున్నవి కావు. వాటిని సజావుగా ఎదుర్కొంటూనే భారత్‌ ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత అస్థిరంగా, క్లిష్టమైనవిగా పరిణమిస్తున్నాయి. దాంతో మనవైపు కొత్త దుర్బలత్వాలు బయటపడుతున్నాయి. భారతీయ సంతతకి చెందిన వారిని భారత్‌ చాలా కాలంగా ‘సున్నితమైన శక్తి’గా పరిగణిస్తూ వచ్చింది. విదేశీ మారక ద్రవ్య వనరుగా చూస్తూ వచ్చింది. ట్రంప్‌ అనుసరిస్తున్న వలస వ్యతిరేక, ‘అమెరికా ఫస్ట్‌’ విధానాలు, గల్ఫ్‌లో యుద్ధం, భారతీయ సంతతికి చెందినవారి బలహీన పునాదులను బయటపడేటట్లు చేస్తున్నాయి. పైపెచ్చు, అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను చూపి, మన విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధంగా, వాటి ఘర్షణల్లోకి మనల్ని లాగుతున్నాయి. 

బయట నుంచి మనల్ని భయపెట్టే పోకడలను కడసారిగా 1960లు, 1970లలో, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చూశాం. మనం అలీన విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, బాహ్య పాత్రధారులకు భారత్‌ ఒక రంగస్థలంలా మారింది. మరోసారి అదే రకమైన కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలానికీ, ఇప్పటికీ మధ్య ఒక వైచిత్రి ఉంది. ఒకవైపు భారత్‌ ఇపుడు మరింత అభివృద్ధి చెందిన, మరింత పలుకుబడి చూపగలిగిన దేశంగా అవతరించిందికానీ, మరోవైపు మరింత దుర్భలమైనదిగా, బాహ్య ప్రభావానికి లోనయ్యేదిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. 

అనేక రకాల విధానాల విషయంలో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా మోదీ కనిపిస్తున్నారు. పాలనాపరమైన ముద్రను చాటడంలో ఆయన అచ్చం ఇందిరను తలపిస్తారు. కానీ, బాహ్యపరమైన ఒత్తిడులకు లొంగకుండా ఎదురు నిలవడంలో ఆమెకున్న నిబ్బరాన్ని ఆయన ఇంకా సమీకరించుకున్నట్లు లేదు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం బాగానే ఉంది కానీ, అగ్ర దేశాల తప్పులను ఎత్తి చూపడంలోనూ అదే రకమైన తెగువను ప్రదర్శించాలి. మూడు (అమెరికా, రష్యా, చైనా) దేశాలతో సంబంధాల్లో  ఆచితూచి వ్యవహరించాలి. వేటిపై ఆధారపడుతున్నామో అవి మనల్ని లొంగదీసుకునే ఆయుధాలుగా ఉపయోగించుకోకుండా చూసుకోవాలి.

సంజయ బారు
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మీడియా సలహాదారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement