ఈనాటితో ఆరంభమయ్యే తెలుగు సంవత్సరం పేరు ‘పరాభవ’. పేరు పరాభవ కనక ఈ సంవత్సరంలో ఎదురు దెబ్బలూ, ప్రతికూల ఫలాలూ ఎక్కువ ఉంటాయని అపోహ పడాల్సిన పని లేదు. విశ్వావసు సంవత్సరం తన పేరుకు తగ్గట్టు విశ్వాన్నంతా సంపదలతో నింపలేదు. ‘రుధిరోద్గారి’ పేరు గల సంవత్సరం వచ్చినప్పుడల్లా నెత్తుటేరులు పారటం లేదు. 1962 ‘శుభకృత్తు’లో మనకు చైనాతో యుద్ధ పరాజయం కలిగింది. కాబట్టి, సంవత్సరం ఏదయినా, కాలం శుభాశుభ మిశ్రమంగానే నడుస్తుంది. అది కాలం తత్త్వం. అది కడలి. అందులో శుభాశుభాల అలలు వస్తూ పోతూనే ఉంటాయి. రెంటివల్లా ప్రయోజనం ఉంటుంది. రెండూ నిలిచేవి కావు.
పరాభవోపి ఉత్సవ ఏవ మానినాం – దైవ వశం వల్ల ఎదురయ్యే అవమానాలు కూడా అభిమాన ధనులైన ధీరులకు ఉత్సాహ కరాలే – అంటాడు మహాకవి భారవి. పరాభవాలు ఎరగకుండా అఖండ విజయాలు సాధించిన ఘనులు చరిత్రలో ఎవరూ లేరు. అపజయాలే విజయాలకు సోపానాలు. ‘నాకు విపత్తులు తగినన్ని ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అవి లేకపోతే భగవంతుడిని స్మరించి, భజించి, తరించేందుకు తగిన ప్రేరణ ఉండదు’ అని ప్రార్థిస్తుంది, ఎన్నో పరాభవాలనూ, కష్టాలనూ ఎదుర్కొని జయించిన కుంతీ దేవి.
మూడు పదులు నిండక ముందు వ్యధాగ్రస్తుడై ‘నాకుషస్సులు లేవు, నాకుగాదులు లేవు’ అని వగచిన కవి కుమారుడు కృష్ణశాస్త్రి గారు, అనుభవంతో పండి, ఎనభయ్యోపడికి చేరువయ్యాక, ‘అసలు, రానున్నదెప్పటికపుడు మంచి...’ అని బల్లగుద్ది ఉగాదిని ఆహ్వానించారు.
ఎప్పుడు ఏ అనుభవం ఎదురయితే అప్పుడు దాన్ని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మాత్రం ఉగాదినీ, వసంత నవరాత్రులనూ హృదయపూర్వకంగా, సానందంగా, సాదరంగా (కవి శిరోమణి జ్ఞానానంద కవిగారి అందమైన మాటలతో) స్వాగతించుదాం:
వలపులు గ్రుమ్మరించి, రస భావ పరంపర కూతమిచ్చి, పే
శల సుమనోజ్ఞమౌ నవ వసంత వధూటిని వింత సోయగ
మ్ముల కులికింప జేసి, పరిఫుల్ల విక స్వర మూర్తివై, తెలుం
గుల దరిశించు నీకు శత కోటి నమస్సులుగాది సుందరీ!
– ఎం. మారుతి శాస్త్రి


