ఒక కేశవుడు | Sakshi Guest Column On Hedgewar birth anniversary | Sakshi
Sakshi News home page

ఒక కేశవుడు

Mar 19 2026 12:40 AM | Updated on Mar 19 2026 12:40 AM

Sakshi Guest Column On Hedgewar birth anniversary

సందర్భం

‘డా‘‘ హెడ్గేవార్‌ ఎంతో దూరదృష్టితో సంఘ్‌ను స్థాపించారు. మనువు అరచేతిలో నున్న ఒక చిన్న చేపపిల్ల పెరిగి పెద్దదై, ప్రళయ కాలంలో మనువు నౌకను ఎలాగైతే కాపాడిందో, అలాగే డాక్టర్జీ స్థాపించిన ఈ సంఘ్‌ కూడా భవిష్యత్తులో బృహత్తర రూపం సంతరించుకొని, దేశాన్ని కాపాడుతుందని నేను నమ్ముతున్నాను’ అన్నారు వీర్‌ సావర్కర్‌ (30 జూలై, 1939). స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీర సావర్కర్‌ ఇలా ఎలా ఊహించగలిగాడు అని ఇప్పటి తరానికి సందేహం. దానికి సమాధానం 1920 దశకం ఆరంభంలో జరిగిన సంఘటన. 

అరవింద్‌ ఘోష్‌ కీలకపాత్ర వహించిన వందే మాతరం ఉద్యమం ఉవ్వెత్తున ప్రజల్లో ఉత్సాహాన్ని, దేశభక్తిని రగిల్చింది. ఘోష్‌ సహా అనేక మంది జైలుపాలయ్యారు. ఆయన జైలునుంచి తిరిగివచ్చేసరికి ఆ ఉద్యమం తాలుకు ఊపు, ఉద్వేగం తగ్గిపోయాయి. అప్పటి కాంగ్రెస్‌ సభల్లో కార్యకర్తగా పాల్గొన్న హెడ్గేవార్‌లో అది మథనానికి కారణమైంది. తాత్కాలిక ఆవేశాలను రగిల్చే ఉద్యమాలు శాశ్వతమైన, సుస్థిరమైన దేశభక్తిని ప్రజల మనసుల్లోకి చొప్పించలేవు... ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి క్రియలో దేశం గురించే తపించే యువశక్తి నిర్మాణం జరగటమే దేశం ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కాగలదన్న సంకల్పం డాక్టర్జీలో కలిగింది. దీని ఫలితంగానే 1925లో కొద్దిమంది యువకులతో కలిసి ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌’ను స్థాపించారు. 

నాయకత్వ లక్షణాలు
హెడ్గేవార్‌ 1889 సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జన్మించారు. నిరుపేద పౌరోహిత్య కుటుంబంలో తెలంగాణ నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామంలో ఆయన జన్మించారు. తరువాత కాలంలో వారి కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వలస వెళ్లింది. ఆయన తండ్రి బలిరాం మంచి విద్యావేత్త. కేశవుడు ఆంగ్ల విద్యను అభ్యసించాలని ఒక మంచి పాఠశాలలో చేర్పించారు. అప్పటి బ్రిటిష్‌ పాలకురాలు విక్టోరియా మహారాణి జన్మదినం రోజున స్కూల్లో మిఠాయిలు పంచితే, వాటిని తీసుకువెళ్లి చెత్తబుట్టలో వేసి, ఒక విదేశీ రాణి జన్మదినం నాకెందుకు అని ప్రశ్నించారు; వందేమాతరం అని నినదించటమే నేరంగా ఉన్న కాలంలో తన సహ విద్యార్థుల చేత వందేమాతరం అని నినదింపజేసి, ఆ పని తనదే అని అంగీకరించటంతో ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. హనుమాన్‌ జయంతులను నిర్వహించడం, అఖాడాల ఏర్పాటును ప్రోత్సహించడం వంటి సంఘటనలు కౌమార దశలోనే హెడ్గేవార్‌ దేశభక్తికి అద్దం పడతాయి. 

1909లో కలకత్తా నగరంలోని ఒక మెడికల్‌ కళాశాలలో ఆయన ప్రవేశం పొందారు. డాక్టర్‌ బి.ఎస్‌. మూన్జే ఆర్థిక సహాయంతో వైద్య విద్యను అభ్యసించడం ప్రారంభించారు. మూన్జే బ్రిటిష్‌ – భారత ఆర్మీలో మెడికల్‌ ఆఫీసర్‌. హిందుత్వం పట్ల గాఢమైన నిష్ఠ కలిగిన మూన్జే పరిచయం హెడ్గేవార్‌లో దేశభక్తి, జాతీయత పట్ల బలమైన విశ్వాసాన్ని నింపింది. స్వదేశీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అరవై సంవత్సరాల మౌల్వీ లియాఖత్‌ హుస్సేన్‌ పరిచయం హెడ్గేవార్‌ ఆలోచనల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. 1911 ప్రాంతంలో సుభాష్‌ చంద్రబోస్‌ తోడ్పాటుతో అనేక సమావేశాలు నిర్వహించడంతో హెడ్గేవార్‌లో నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయి. 

కలకత్తాలో ఉన్న సమయంలోనే ‘అనుశీలన సమితి’ వంటి అనేక విప్లవవాద సంస్థలతో, వాటిని నడిపే నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో దేశంలో ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఎక్కువ. హెడ్గేవార్‌ ఇతర విద్యార్థుల సహాయంతో ‘సేవా సమితి’ని స్థాపించి, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నించారు. 1914లో బాల గంగాధర్‌ తిలక్‌ మాండలే జైలు నుండి విడుదలైన తర్వాత హెడ్గేవార్‌ ఆయనకు ముఖ్య అనుచరుడిగా మారారు. తరువాత జరిగిన పరిణామాల వల్ల సంఘాన్ని ప్రారంభించి, శాఖ అనే నిత్య సాధనా వేదికను ప్రవేశ పెట్టారు. క్రమంగా ఆ శాఖలలో వేలాది మంది స్వయంసేవకులు పాల్గొనడం ప్రారంభించారు. హెడ్గేవార్‌ దీర్ఘదృష్టితో ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతోమంది నిస్వార్థ సేవాభావం కలిగిన ప్రచారకులను, కార్యకర్తలను తీర్చిదిద్దింది. 

దేశ సౌభాగ్యమే లక్ష్యం
సంఘంలో చేరటానికి కులమూ, విద్యార్హత, ఆర్థిక స్థాయి వగైరాలు అర్హతలు కాదు. దేశాన్ని ప్రేమించటం ఒక్కటే యోగ్యత. సమాజంలో ఉన్న కుల, మత, వర్గ, వర్ణ విభేదాలను తగ్గించి సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఈ శాఖలు ఉపయోగపడతాయని ప్రముఖులెందరో భావించారు. గాంధీజీ, నేతాజీ, డా‘‘ అంబేడ్కర్‌ లాంటి నాయకులెందరో శాఖలను సందర్శించారు. సంఘ లక్ష్యం ప్రతి స్వయంసేవకుడిలో రెండు గుణాలు నింపటం – వ్యక్తి సౌశీల్యం, జాతీయ సౌశీల్యం.

సంఘం హింసను బోధించదు. సంఘం సమాజాన్ని ద్వేషించటం బోధించదు. ప్రతి స్వయంసేవకుడిలో దేశ సౌభాగ్యాన్ని గురించి ఆలోచించే తత్త్వాన్ని, విలువలను మాత్రమే కథల రూపంలో, ఆటల రూపంలో చొప్పించే కార్యక్రమాలు చేస్తూంటుంది. ఇప్పుడు సంఘంలో స్వయంసేవక్‌ కావటం అంటే ఒక దేశభక్తుడు తయారవ్వటమే అని అందరూ భావిస్తున్నారు. అలా పెరిగిన సంఘ్‌కు ఇప్పుడు నూరేళ్లు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని సంఘటితం చేయడం, సమాజాన్ని సుసంపన్నంగా నిర్మించడం, అలాగే భారతమాతను విశ్వగురువుగా నిలబెట్టడం మనందరి కర్తవ్యం. ఆ మహత్తర లక్ష్య సాధనలో మనందరం భాగస్వాములుగా నిలవడమే హెడ్గేవార్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది.

బండారు దత్తాత్రేయ
వ్యాసకర్త మాజీ గవర్నర్‌ (ఉగాది రోజున హెడ్గేవార్‌ జయంతి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement