sangh
-
ఒక కేశవుడు
‘డా‘‘ హెడ్గేవార్ ఎంతో దూరదృష్టితో సంఘ్‌ను స్థాపించారు. మనువు అరచేతిలో నున్న ఒక చిన్న చేపపిల్ల పెరిగి పెద్దదై, ప్రళయ కాలంలో మనువు నౌకను ఎలాగైతే కాపాడిందో, అలాగే డాక్టర్జీ స్థాపించిన ఈ సంఘ్ కూడా భవిష్యత్తులో బృహత్తర రూపం సంతరించుకొని, దేశాన్ని కాపాడుతుందని నేను నమ్ముతున్నాను’ అన్నారు వీర్ సావర్కర్ (30 జూలై, 1939). స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీర సావర్కర్ ఇలా ఎలా ఊహించగలిగాడు అని ఇప్పటి తరానికి సందేహం. దానికి సమాధానం 1920 దశకం ఆరంభంలో జరిగిన సంఘటన. అరవింద్ ఘోష్ కీలకపాత్ర వహించిన వందే మాతరం ఉద్యమం ఉవ్వెత్తున ప్రజల్లో ఉత్సాహాన్ని, దేశభక్తిని రగిల్చింది. ఘోష్ సహా అనేక మంది జైలుపాలయ్యారు. ఆయన జైలునుంచి తిరిగివచ్చేసరికి ఆ ఉద్యమం తాలుకు ఊపు, ఉద్వేగం తగ్గిపోయాయి. అప్పటి కాంగ్రెస్ సభల్లో కార్యకర్తగా పాల్గొన్న హెడ్గేవార్‌లో అది మథనానికి కారణమైంది. తాత్కాలిక ఆవేశాలను రగిల్చే ఉద్యమాలు శాశ్వతమైన, సుస్థిరమైన దేశభక్తిని ప్రజల మనసుల్లోకి చొప్పించలేవు... ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి క్రియలో దేశం గురించే తపించే యువశక్తి నిర్మాణం జరగటమే దేశం ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కాగలదన్న సంకల్పం డాక్టర్జీలో కలిగింది. దీని ఫలితంగానే 1925లో కొద్దిమంది యువకులతో కలిసి ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ను స్థాపించారు. నాయకత్వ లక్షణాలుహెడ్గేవార్ 1889 సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జన్మించారు. నిరుపేద పౌరోహిత్య కుటుంబంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామంలో ఆయన జన్మించారు. తరువాత కాలంలో వారి కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వలస వెళ్లింది. ఆయన తండ్రి బలిరాం మంచి విద్యావేత్త. కేశవుడు ఆంగ్ల విద్యను అభ్యసించాలని ఒక మంచి పాఠశాలలో చేర్పించారు. అప్పటి బ్రిటిష్ పాలకురాలు విక్టోరియా మహారాణి జన్మదినం రోజున స్కూల్లో మిఠాయిలు పంచితే, వాటిని తీసుకువెళ్లి చెత్తబుట్టలో వేసి, ఒక విదేశీ రాణి జన్మదినం నాకెందుకు అని ప్రశ్నించారు; వందేమాతరం అని నినదించటమే నేరంగా ఉన్న కాలంలో తన సహ విద్యార్థుల చేత వందేమాతరం అని నినదింపజేసి, ఆ పని తనదే అని అంగీకరించటంతో ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. హనుమాన్ జయంతులను నిర్వహించడం, అఖాడాల ఏర్పాటును ప్రోత్సహించడం వంటి సంఘటనలు కౌమార దశలోనే హెడ్గేవార్ దేశభక్తికి అద్దం పడతాయి. 1909లో కలకత్తా నగరంలోని ఒక మెడికల్ కళాశాలలో ఆయన ప్రవేశం పొందారు. డాక్టర్ బి.ఎస్. మూన్జే ఆర్థిక సహాయంతో వైద్య విద్యను అభ్యసించడం ప్రారంభించారు. మూన్జే బ్రిటిష్ – భారత ఆర్మీలో మెడికల్ ఆఫీసర్. హిందుత్వం పట్ల గాఢమైన నిష్ఠ కలిగిన మూన్జే పరిచయం హెడ్గేవార్‌లో దేశభక్తి, జాతీయత పట్ల బలమైన విశ్వాసాన్ని నింపింది. స్వదేశీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అరవై సంవత్సరాల మౌల్వీ లియాఖత్ హుస్సేన్ పరిచయం హెడ్గేవార్ ఆలోచనల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. 1911 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ తోడ్పాటుతో అనేక సమావేశాలు నిర్వహించడంతో హెడ్గేవార్‌లో నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయి. కలకత్తాలో ఉన్న సమయంలోనే ‘అనుశీలన సమితి’ వంటి అనేక విప్లవవాద సంస్థలతో, వాటిని నడిపే నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో దేశంలో ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఎక్కువ. హెడ్గేవార్ ఇతర విద్యార్థుల సహాయంతో ‘సేవా సమితి’ని స్థాపించి, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నించారు. 1914లో బాల గంగాధర్ తిలక్ మాండలే జైలు నుండి విడుదలైన తర్వాత హెడ్గేవార్ ఆయనకు ముఖ్య అనుచరుడిగా మారారు. తరువాత జరిగిన పరిణామాల వల్ల సంఘాన్ని ప్రారంభించి, శాఖ అనే నిత్య సాధనా వేదికను ప్రవేశ పెట్టారు. క్రమంగా ఆ శాఖలలో వేలాది మంది స్వయంసేవకులు పాల్గొనడం ప్రారంభించారు. హెడ్గేవార్ దీర్ఘదృష్టితో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ఎంతోమంది నిస్వార్థ సేవాభావం కలిగిన ప్రచారకులను, కార్యకర్తలను తీర్చిదిద్దింది. దేశ సౌభాగ్యమే లక్ష్యంసంఘంలో చేరటానికి కులమూ, విద్యార్హత, ఆర్థిక స్థాయి వగైరాలు అర్హతలు కాదు. దేశాన్ని ప్రేమించటం ఒక్కటే యోగ్యత. సమాజంలో ఉన్న కుల, మత, వర్గ, వర్ణ విభేదాలను తగ్గించి సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఈ శాఖలు ఉపయోగపడతాయని ప్రముఖులెందరో భావించారు. గాంధీజీ, నేతాజీ, డా‘‘ అంబేడ్కర్ లాంటి నాయకులెందరో శాఖలను సందర్శించారు. సంఘ లక్ష్యం ప్రతి స్వయంసేవకుడిలో రెండు గుణాలు నింపటం – వ్యక్తి సౌశీల్యం, జాతీయ సౌశీల్యం.సంఘం హింసను బోధించదు. సంఘం సమాజాన్ని ద్వేషించటం బోధించదు. ప్రతి స్వయంసేవకుడిలో దేశ సౌభాగ్యాన్ని గురించి ఆలోచించే తత్త్వాన్ని, విలువలను మాత్రమే కథల రూపంలో, ఆటల రూపంలో చొప్పించే కార్యక్రమాలు చేస్తూంటుంది. ఇప్పుడు సంఘంలో స్వయంసేవక్ కావటం అంటే ఒక దేశభక్తుడు తయారవ్వటమే అని అందరూ భావిస్తున్నారు. అలా పెరిగిన సంఘ్‌కు ఇప్పుడు నూరేళ్లు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని సంఘటితం చేయడం, సమాజాన్ని సుసంపన్నంగా నిర్మించడం, అలాగే భారతమాతను విశ్వగురువుగా నిలబెట్టడం మనందరి కర్తవ్యం. ఆ మహత్తర లక్ష్య సాధనలో మనందరం భాగస్వాములుగా నిలవడమే హెడ్గేవార్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది.బండారు దత్తాత్రేయవ్యాసకర్త మాజీ గవర్నర్ (ఉగాది రోజున హెడ్గేవార్ జయంతి) -
నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
నాగ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల సంఘ్ ప్రధాన కార్యాలయానికి ఈరోజు (ఆదివారం) చేరుకున్నారు. ఆయన 11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి స్మృతి మందిర్‌లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులలో ఒకరైన గోల్వాల్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’(Madhav Eye Clinic Premium Center)కు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్వాగతం పలికారు. వీరు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఆయనతో పాటు ఉన్నారు.ప్రధాని తన నాగ్‌పూర్ పర్యటనలో దీక్షాభూమిని కూడా సందర్శించనున్నారు. 1956లో బాబా సాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు నివాళులర్పించనున్నారు. ప్రధాని పర్యటనను ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది.ఇది కూడా చదవండి: Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు -
ఆర్ఎస్ఎస్ చేతికి యూపీ ఉపఎన్నికల బాధ్యత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ఎస్పీ, బీజేపీలు బిజీగా ఉన్నాయి. ఎస్పీ ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఒకట్రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వినవస్తున్నాయి. యూపీలో ఉప ఎన్నికల బాధ్యతను ఆర్ఎస్ఎస్కు బీజేపీ అప్పగించింది.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు మధురకు చేరుకున్నారు. ఆయన 10 రోజుల పాటు మధుర పర్యటనలో ఉండనున్నారు. తాజాగా సంఘ్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచడం, బూత్ నిర్వహణ, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.సంఘ్ వ్యూహంతోనే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు యూపీలో బీజేపీ గెలుపునకు వ్యూహం రచించే పనిలో సంఘ్ బిజీగా ఉంది. యూపీలో హిందూ ఓటర్లను ఏకం చేయడం, ఓబీసీ, దళిత ఓటర్లను బీజేపీవైపు ఆకర్షించడం తదితర అంశాలపై సంఘ్ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సంఘ్ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి, ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై కూడా సంఘ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బెజవాడలో వ్యక్తి దారుణ హత్య -
ప్రభుత్వంలో జోక్యం చేసుకోం: ఆర్ఎస్ఎస్
సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు: వెంకయ్య న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన బీజేపీకి అవసరమైతే సలహాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చమని ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. బీజేపీకి రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమని పేర్కొంది. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి బీజేపీ నేతల తాకిడి కొనసాగుతోంది. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సంఘ్ అగ్ర నేతలను కలిశారు. ఇతర ముఖ్య నేతలు కూడా సంఘ్‌తో మంతనాల్లో మునిగిపోయారు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని సంఘ్ జాతీయ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ ఆదివారం జైపూర్‌లో స్పష్టం చేశారు. తాము రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తాము బీజేపీకి ఎలాంటి మార్గనిర్దేశనం చేయలేదని చెప్పారు. సంఘ్ సిద్ధాంతాలు వారికి(బీజేపీ నేతలకు) తెలుసునని, ఆ దిశగానే వారు పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరులో కానీ, రాజకీయాల్లో కానీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే సలహాలు మాత్రం ఇస్తామని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలే సమీక్షిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదన్నారు. -
ఢిల్లీ పీఠం దిశగా ‘సంఘ్’ వ్యూహం
న్యూఢిల్లీ: వరుసగా 2004, 2009ల్లో రెండు సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో.. ఈ సారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే దిశగా ‘సంఘ్’ పరివారం వ్యూహరచన చేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచీ చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ సహా ‘సంఘ్’ సంస్థల నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సురేష్ భయ్యాజీ, సురేష్ సోనీ, దత్తాత్రేయ హోస్బలే, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా తదితర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అంతేగాకుండా ఎన్నికల సమయంలో ‘సంఘ్’ పక్షాల మధ్య సమన్వయం, సహకారం, మైనారిటీలు, ఎస్సీఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, యువత లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించే అంశంపై చర్చిస్తారు. అయితే, బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే అంశం ఈ సమావేశాల్లో చర్చించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ, ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రతిపాదించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవలే మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ, సుష్మాలతో భేటీ అయి, ఏకాభిప్రాయం కోసం చర్చించిన నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తొలిరోజు భేటీలో క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో వీహెచ్‌పీ చేపట్టిన యాత్ర, దానిని అడ్డుకున్న అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలపై ‘సంఘ్’ వర్గాలు సోమవారం ప్రకటన చేసే అవకాశముంది.


