
నాగ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల సంఘ్ ప్రధాన కార్యాలయానికి ఈరోజు (ఆదివారం) చేరుకున్నారు. ఆయన 11 ఏళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి స్మృతి మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులలో ఒకరైన గోల్వాల్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’(Madhav Eye Clinic Premium Center)కు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్వాగతం పలికారు. వీరు ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఆయనతో పాటు ఉన్నారు.
ప్రధాని తన నాగ్‌పూర్ పర్యటనలో దీక్షాభూమిని కూడా సందర్శించనున్నారు. 1956లో బాబా సాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు నివాళులర్పించనున్నారు. ప్రధాని పర్యటనను ఆర్‌ఎస్‌ఎస్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది.
ఇది కూడా చదవండి: Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు