సిక్కింలో అర్ధరాత్రి భూకంపం | Earthquake: 4.0 Quake Jolts Parts Of Sikkim | Sakshi
Sakshi News home page

సిక్కింలో అర్ధరాత్రి భూకంపం

Feb 6 2026 7:35 AM | Updated on Feb 6 2026 8:41 AM

Earthquake: 4.0 Quake Jolts Parts Of Sikkim

గాంగ్‌టక్: సిక్కింలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిక్కింలోని గ్యాల్‌షింగ్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం అర్ధరాత్రి 1:09 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ప్రకంపనల వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. తదుపరి ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) వస్తాయేమోనన్న ఆందోళనతో చాలా మంది నిమిషాల తరబడి బయటే ఉండిపోయారు.

ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము వరకు సుమారు 12 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యంత శక్తివంతమైనది 1:09 గంటలకు వచ్చిన ప్రకంపనలు 4.5 తీవ్రత కలిగిఉంది. భూ కేంద్రం గ్యాల్‌షింగ్ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. కేవలం గ్యాల్‌షింగ్‌లో మాత్రమే కాకుండా గాంగ్‌టక్, మాంగన్, నామ్చి ప్రాంతాల్లో కూడా 2 నుండి 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

మయన్మార్‌లో..
భారత పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6:03 గంటలకు వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 96 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్‌లో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. 2025లో వచ్చిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement