ఇరాన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. విరోధి దేశం ఇజ్రాయెల్‌లో భూకంపం సంభవించింది. నెగెవ్ ఎడారిలోని డిమోనా ప్రాంతంలో 4.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. టెహ్రాన్ హెచ్చరికల నేపథ్యంతో టెల్ అవీవ్ రహస్యంగా అణు పరీక్షలు జరిపి ఉండవచ్చని.. ఇదే భూకంపానికి కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.
గురువారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు జెరూసలేం వరకు ప్రభావం చూపాయి. కొన్ని సెకన్లపాటు నేల కంపించగా.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని అన్ని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరుగుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. దీంతో ఇది సహజసిద్ధమైన భూకంపం కాకపోవచ్చనే చర్చ మొదలైంది. ఇది ఇరాన్‌తో పాటు అమెరికాకు ఇజ్రాయెల్ పంపిన సంకేతం అయి ఉండొచ్చనే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా..
డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు రహస్య అణు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 1950లలో నిర్మించిన ఈ కేంద్రంలో హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. పైగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల విస్తరణ కూడా ధృవీకరణ అయ్యింది. అయితే అణు పరీక్షలు, అణ్వాయుధాలున్నాయనే ప్రచారాన్ని ఆ దేశం ఏనాడూ అంగీకరించలేదు. అయితే ఇజ్రాయెల్ భూగర్భ శాస్త్ర సంస్థ మాత్రం అధికారికంగా ఇది సహజ భూకంపమేనని ప్రటించడం గమనార్హం.
ఇరాన్ అణు ప్రోగ్రామ్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశమంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు కూడా జరిపింది. ఆ సమయంలో ఇరాన్ కూడా అణు పరీక్షలు నిర్వహించినట్లు విస్తృత ప్రచారం జరిగింది.
ఇక ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ బ్యాన్, సమాచార వ్యవస్థలను కట్టడి చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఆందోళనకారుల్ని కఠినంగానే అణచివేస్తున్నారనే సమాచారం మాత్రం బయటకు పొక్కుతోంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో మరణాలు(వేలల్లోనే) సంభవించినట్లు, అరెస్టులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..
అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై హింసను ఉపేక్షించేది లేదని, అవసరమైతే సైనిక చర్య తప్పదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో చర్చలకు ఆస్కారం ఉందన్న మాటను ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ.. తమ దేశం జోలికి వస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తున్నారు.


