అర్ష్‌దీప్- ప్రభ్‌సిమ్రన్ (PC: PCA)
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా సిక్కింతో మ్యాచ్‌లో టీమిండియా స్టార్, పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్‌తో పాటు సుఖ్‌దీప్ బజ్వా (Sukhdeep Bajwa), మయాంక్ మార్కండే, గుర్నూర్ బ్రార్ రాణించడంతో సిక్కిం 75 పరుగులకే ఆలౌట్ అయింది.
ప్రభ్‌సిమ్రన్ సారథ్యంలో..
బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలో దిగాడు అర్ష్‌దీప్ సింగ్. సొంతజట్టు పంజాబ్ తరపున శనివారం ఈ లెఫ్టార్మ్ పేసర్ దర్శనమివ్వగా.. భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాత్రం అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
మరో టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇలాంటి తరుణంలో సిక్కింతో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జైపూర్ వేదికగా టాస్ గెలిచిన పంజాబ్.. సిక్కింను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు దుమ్ములేపారు.
నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్
సిక్కిం ఓపెనర్లలో అమిత్ రజేరా (8) వికెట్ కూల్చి సుఖ్‌దీప్ శుభారంభం అందించగా.. ప్రాణేశ్ ఛెత్రీ (8)ని పెవిలియన్‌కు పంపి అర్ష్‌దీప్ తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆశిష్ తాపా (0)ను సుఖ్‌దీప్ డకౌట్ చేయగా.. క్రాంతి కుమార్ (6), పల్జోర్ తమాంగ్ (13), కెప్టెన్ లీ యోంగ్ లెప్చా (0), అంకుర్ మాలిక్ (2) వికెట్లను అర్ష్‌దీప్ కూల్చాడు.
మిగిలిన వారిలో రాహుల్ కుమార్ ప్రసాద్ (6), ఎండీ సప్తుల్లా (10)లను మయాంక్ మార్కండే అవుట్ చేశాడు. ఇక గుర్నూర్ బ్రార్.. గురిందర్ సింగ్ (10) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా సిక్కిం 22.2 ఓవర్లలో కేవలం 75 పరుగులు చేసి కుప్పకూలింది.
టీ20 తరహా బ్యాటింగ్
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. హర్నూర్ సింగ్ (13 బంతుల్లో 22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 53) టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగి పంజాబ్‌ను సునాయాసంగా గెలిపించారు.


