T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం | Zimbabwe Announces Squad For T20 World Cup 2026, Former Captain Graeme Cremer Makes Surprise Comeback | Sakshi
Sakshi News home page

T20 WC: జింబాబ్వే అనూహ్య నిర్ణయం.. సంచలన ఎంపికలు

Jan 3 2026 10:13 AM | Updated on Jan 3 2026 11:14 AM

Zimbabwe Announce Raza led T20 WC 2026 Squad Cremer returns

కెప్టెన్‌ సికిందర్‌ రజా

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు జింబాబ్వే తమ జట్టును ప్రకటించింది. సికందర్‌ రజా సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు దక్కింది. అయితే, అనూహ్య రీతిలో మాజీ సారథి గ్రేమ్‌ క్రెమర్‌పై సెలక్టర్లు ఈసారి నమ్మకం ఉంచడం విశేషం.

ఏడేళ్ల విరామం తర్వాత 
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత 39 ఏళ్ల క్రెమర్‌ గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. క్లబ్‌ క్రికెట్‌లో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ లెగ్‌ స్పిన్నర్‌.. అఫ్గనిస్తాన్‌తో అక్టోబరులో జరిగిన సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. గోల్ఫ్‌లో రాణించేందుకు, భార్య మెర్నా కెరీర్‌ (పైలట్‌)  కోసం యూఏఈకి వెళ్లిపోయిన క్రెమర్‌.. 2018 తర్వాత తొలిసారి జింబాబ్వే తరఫున మళ్లీ గతేడాది క్రికెట్‌ ఆడాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌- శ్రీలంకతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ ఆడిన క్రెమర్‌ రెండు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్‌ జట్టులో ఫ్రంట్‌లైన్‌ స్పిన్నర్‌గా క్రెమర్‌ ఎంపికయ్యాడు. అతడికి తోడుగా స్పిన్‌ విభాగంలో వెల్లింగ్‌టన్‌ మసకజ్ద, కెప్టెణ్‌ రజా ఉన్నారు.

మరో సంచలన ఎంపిక
ఇక ఈ జట్టులో మరో వెటరన్‌ ప్లేయర్‌, టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి (ఫిబ్రవరి 7) ఒకరోజు ముందే 40వ పడిలో అడుగుపెట్టనున్న బ్రెండన్‌ టేలర్‌ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. పేస్‌ దళంలోకి బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ తిరిగి వచ్చాడు. అదే విధంగా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ రిచర్డ్‌ ఎంగరవకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది. వీరితో పాటు బ్రాడ్లీ ఎవాన్స్‌, టినోటెండా మపోసా కూడా జట్టులో ఉన్నారు.

కాగా 2024 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే.. ఈసారి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంకతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. ఇక ఈ మెగా టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఒమన్‌తో ఫిబ్రవరి 9న జింబాబ్వే ఈ టోర్నీలో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి జింబాబ్వే జట్టు
సికిందర్‌ రజా (కెప్టెన్‌), బ్రియాన్‌ బెనెట్‌, ర్యాన్‌ బర్ల్‌, గ్రేమ్‌ క్రెమర్‌, బ్రాడ్లీ ఎవాన్స్‌, క్లైవ్‌ మడాండే, టినోటెండా మపోసా, టాడివనాషీ మరుమాని, వెల్లింగ్‌టన్‌ మసకజ్ద, టోనీ మున్‌యోంగా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్‌ ముజర్‌బాని, డియోన్‌ మేయర్స్‌, రిచర్ట్‌ ఎంగరవ, బ్రెండన్‌ టేలర్‌. 

చదవండి: Usman Khawaja:పడి లేచిన ప్రయాణం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement