భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన | Pakistan Khawaja Asif threatens India over Indus Waters Treaty | Sakshi
Sakshi News home page

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన

Jun 22 2026 8:09 AM | Updated on Jun 22 2026 10:44 AM

Pakistan Khawaja Asif threatens India over Indus Waters Treaty

భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.

ఇండస్ ఒప్పందం ఏమిటి?
1960లో వరల్డ్‌ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్‌కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.

ఎందుకు మళ్లీ వివాదం?
గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్‌ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.

మారిన పరిస్థితులు..
ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్‌లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్‌ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement